మంచిర్యాల జిల్లాలో 4,636 ఎకరాల్లో మునిగిన పంటలు

మంచిర్యాల జిల్లాలో 4,636 ఎకరాల్లో మునిగిన పంటలు

మంచిర్యాల, వెలుగు: ప్రాణహిత బ్యాక్​ వాటర్​తో మంచిర్యాల జిల్లాలో 4,636 ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. కోటపల్లి మండలంలోని 18 గ్రామాల్లో 864 ఎకరాలు, భీమిని మండలంలోని ఏడు గ్రామాలలో 112 ఎకరాలు, వేమనపల్లి మండలంలోని 15 గ్రామాల్లో 2,155 ఎకరాలు మునిగాయి. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రాథమిక రిపోర్టు పంపినట్టు   డీఏవో  కల్పన తెలిపారు. వరదలు తగ్గిన తర్వాత వాస్తవ పంటనష్టం అంచనా వేస్తామన్నారు. మంగళవారం సాయంత్రానికి ప్రాణహితకు వరద తగ్గుముఖం పట్టింది. 

  •  ఎకరానికి రూ.20వేల పరిహారం ఇవ్వాలి : బీజేపీ 

ప్రాణహిత వరదలతో పంటలు నీటమునిగి నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.20వేల పరిహారం చెల్లించాలని- బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. మంగళవారం ఆయన కోటపల్లి మండలంలోని సిర్సా గ్రామంలో నీటమునిగిన పంటలను నాటుపడవపై వెళ్లి పరిశీలించారు. నగునూరి వెంకటేశ్వర్లుగౌడ్, దుర్గం అశోక్, మంత్రి రామన్న, పట్టి వెంకటకృష్ణ పాల్గొన్నారు.   

  • మూడు రోజులుగా ముంపులోనే 

బెల్లంపల్లిరూరల్​: మూడు రోజులుగా ప్రాణహిత నది ముంపు వరదలోనే 2500 ఎకరాల పత్తి చేళ్లు ఉనిగి ఉన్నాయి. కళ్లంపల్లి, ముక్కిడిగూడం, జాజులపేట, సుంపుటం, వేమనపల్లి, కల్మలపేట, రాచర్ల, కేతన్​పల్లి, ముల్కలపేట శివారులలో వరద పోటెత్తి ప్రవహిస్తోంది. మంగళవారం ఉదయం కొంచం తగ్గి మళ్లీ ఉద్ధృతమైంది.

ముల్కలపేట-రాచర్ల గ్రామాల మధ్య రహదారితో పాటు సుంపుటం, అట్టలొర్రే, అంకన్నపేట ఒర్రే, ముక్కిడిగూడం , ముత్యాలమ్మగుడి వద్దకు వరద పోటెత్తింది. పుష్కరఘాట్​తో పాటు ఎంచపాయకు రాకపోకలు నిలిచిపోయాయి. దిగువన గోదావరి నదిలో సైతం వరద పెరుగుతుండటం ఎగువన పెనుగంగా, వార్దా నదుల నుంచి వరద పోటెత్తడంతో భారీ నష్టం కలుగుతోంది.