- వేలాది ఎకరాల్లో నష్టం
- మహారాష్ట్ర వరద, కాళేశ్వరం బ్యాక్వాటరే కారణం
- మంచిర్యాల జిల్లాలో జలదిగ్బంధంలో పలు గ్రామాలు
మంచిర్యాల, వెలుగు : మహారాష్ర్టతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో ప్రాణహిత ఉగ్రరూపం దాల్చింది. ఎటుచూసినా కిలోమీటర్ల మేర వరద పోటు కమ్మేసింది. మంచిర్యాల జిల్లాలోని వేమనపల్లి, కోటపల్లి మండలాల్లోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాది ఎకరాల్లో పత్తి, ఇతర పంటలు నీటమునిగాయి. వేమనపల్లి మండల కేంద్రంతో పాటు కేతన్పల్లి, కల్మలపేట, రాచర్ల, గొర్లపల్లి, సుంపుటం, జాజులపేట, ముక్కిడిగూడెం, కల్లంపెల్లి శివార్లలో 2,500 ఎకరాల్లో పత్తిచేలు నీటమునిగాయి.
అలాగే, కోటపల్లి మండలం వెంచపల్లి, సూపాక, జనగామ, ఆలుగామ, సిర్సా, పుల్లగామ, అన్నారం గ్రామాల్లో కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల 2వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇప్పటివరకు ఎకరానికి రూ.15వేల పెట్టుబడి పెట్టామని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరారు. రెవెన్యూ అధికారులు, కాంగ్రెస్ నాయకులు వేమనపల్లి, రాచర్ల, ముల్కలపేట గ్రామాల్లో నాటు పడవల్లో వెళ్లి మునిగిన పంటలను పరిశీలించారు.
అంత్యక్రియలకు తిప్పలు...
ప్రాణహిత వరద గ్రామాలను చుట్టుముట్టడంతో అంత్యక్రియలకు ఇబ్బందిగా మారింది. వేమనపల్లి మండల కేంద్రంలో రెండు రోజుల్లో వగావత్ సాలక్క, ఎల్లెల గంగయ్య వృద్ధాప్యంతో చనిపోయారు. మండల కేంద్రంలోని వైకుంఠధామం నిరుపయోగంగా మారడంతో ఎవరైనా చనిపోతే ప్రాణహితకు తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు చేస్తున్నారు.
కానీ, నాలుగు రోజులుగా ప్రాణహిత నిండుగా ప్రవహిస్తుండడంతో అటు వెళ్లే పరిస్థితి లేదు. గ్రామ శివారులోని అంపుడొర్రె వరకు ప్రాణహిత బ్యాక్ వాటర్ అవరించి ఉండడంతో ప్రమాదకరంగా మృతదేహంతో అవతలి వైపు దాటి మత్తడి ఒర్రెలో అంత్యక్రియలు చేశారు.