చెడు గొట్టు వానల బీభత్సం..తడిసిపోయిన ధాన్యం

చెడు గొట్టు వానలు రాష్ట్ర వ్యాప్తంగా బీభత్సం సృష్టించాయి. చేతికొచ్చిన పంటలను నాశనం చేశాయి. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో ధాన్యం తడిసిపోయింది. ఐకెపి కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం నీటిమయం అయింది. వర్షం నీటికి ధాన్యం కొట్టుకుపోయింది. దీంతో అన్నదాతలు బోరున విలపిస్తున్నారు. అకాల వర్షాలతో నష్టపోయామని...తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు.  ఉన్నత స్థాయి అధికారులు మిల్లర్లతో మాట్లాడితే తప్ప  సమస్య పరిష్కారం కాదని చెబుతున్నారు. 

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కంచనపల్లి, అర్జల బావి ఐకేపీ సెంటర్లల్లో  దాదాపు 3000 బస్తాలకు పైగా ధాన్యం తడిసిపోయింది. ఏప్రిల్ 25వ తేదీన ధాన్యాన్ని  హమాలీలు బస్తాల్లో నింపారు. అయితే రవాణా చేసేందుకు లారీలు రాకపోవడంతో రాత్రి వర్షానికి ధాన్యం తడిసిపోయింది. ధాన్యం బస్తాలను తీసుకెళ్లడానికి లారీలు రాకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన సమయంలో లారీలు వస్తే..ధాన్యం తడిసిపోయేది కాదంటున్నారు. 

మరోవైపు చిట్యాల, నార్కట్ పల్లి మండలాల్లో రాత్రి కురిసిన అకాల వర్షానికి మార్కెట్లలో  ధాన్యం నీటిముద్దలుగా మారింది. అటు  యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం, అడ్డగుడూర్,మోత్కూర్,గుండాల మండలాల్లో ఈదురుగాలులతో కూడిన  వర్షానికి కల్లాల్లోని ధాన్యం నీటమునిగింది.  
పంటను అమ్ముకునే సమయానికి వర్షాల వల్ల ధాన్యం తడిసిపోవడంపై రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.