విత్తన లోపం.. పచ్చదనానికి శాపం..చాలా చోట్ల మొలకెత్తని విత్తనాలు

విత్తన లోపం..  పచ్చదనానికి శాపం..చాలా చోట్ల మొలకెత్తని విత్తనాలు
  • అభాసుపాలవుతున్న హరితహారం స్కీమ్
  • జూలై మొదటి వారంలో మొక్కలు అందుబాటులోకి రావడం కష్టమే!

ఆసిఫాబాద్, వెలుగు: గ్రామాల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం స్కీమ్ అడుగడుగునా అభాసుపాలవుతోంది. అనుభవాలను దృష్టిలో పెట్టుకొని గుణపాఠం నేర్వని ఆఫీసర్లు ఈ ఏడాది మొక్కలు నాటే ప్రోగ్రాంలోనూ ముందు జాగ్రత్తలు చేపట్టడంలేదు. ఫలితంగా జిల్లాలోని చాలా నర్సరీల్లో విత్తనాలు మొలకెత్తలేదు. మండల స్థాయి ఆఫీసర్ల పర్యవేక్షణ లోపం, నర్సరీల నిర్వాహకుల ఇష్టారాజ్యం, విత్తన లోపం పచ్చదానికి శాపంగా మారింది. అంతరించిపోతున్న అడవుల విస్తీర్ణం పెంచాలన్న గవర్నమెంట్ ఆశయం నీరుగారుతోంది. 

విత్తన లోపం, సక్రమంగా నీళ్లు అందివ్వకపోవడంతో నర్సరీల్లో ఆశించిన స్థాయిలో మొక్కలు పెరగడం లేదు. నర్సరీల నిర్వహణ కోసం కోట్లాది రూపాయలు వృథా అవుతున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 52 .69 లక్షల మొక్కలు నాటేందుకు 334 గ్రామ పంచాయతీల్లోని నర్సరీల్లో మొక్కల పెంపునకు అధికారులు శ్రీకారం చుట్టారు. 

విడతల వారీగా మొక్కలు పెంచి నాటేందుకు చర్యలు చేపట్టారు. డీఆర్ డీఏ 35 లక్షలు, వ్యవసాయ శాఖ 30లక్షలు, అటవీశాఖ 10.38  లక్షలు, సింగరేణి 2 లక్షలు, మున్సిపాలిటీలు 2.74 లక్షలు, విద్యా శాఖ 40 వేలు, ఆబ్కారీ శాఖ 38 వేలు, మిగతా శాఖలు 1.40 లక్షల మొక్కలు నాటేందుకు టార్గెట్ పెట్టుకున్నారు. ఈ టార్గెట్ కు అనుగుణంగా విత్తనాలు తెప్పించి గ్రామ పంచాయతీల్లోని నర్సరీల్లో నాటారు. కానీ వాటిలో సగానికిపైగా మొలకెత్తలేదు. నాసిరకం విత్తనాలు, క్షేత్రస్థాయిలో పర్యవేక్షించకపోవడం, నీటి సౌకర్యం కల్పించకపోవడంతోనే విత్తనాలు మొలకెత్తలేదు. మొక్కలు నాటే కార్యక్రమం జూలై మొదటి వారంలో ఉండడంతో ఆ సమయానికి మొక్కలు చేతికి వచ్చే పరిస్థితి లేదు

మొలకెత్తని చోట మళ్లీ విత్తనాలు నాటిస్తాం


వచ్చే నెలలో మొక్కలు నాటే కార్యక్రమం స్టార్ట్ చేస్తం. గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నం. మొలకెత్తని చోట మళ్లీ విత్తనాలు నాటాలని ఎంపీడీవోలకు ఆదేశాలు ఇచ్చాం. మీటింగ్​లు పెట్టి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నం. మొక్కల పెంపకం, రక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నం. మొక్కలకు సక్రమంగా నీళ్లు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటా. రెగ్యులర్ గా మానటరింగ్ చేస్తాం. జూలై నాటికి మొక్కలు సిద్ధం చేస్తాం.
- సురేందర్, డీఆర్డీవో, ఆసిఫాబాద్