విప్ అంటే కొరడాలు ఝుళిపించడమే

విప్ అంటే కొరడాలు ఝుళిపించడమే

 రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ఒక దారుణం. కలవరం, కలకలం రేకెత్తించే పని. కేంద్రంలో అధికారంలో ఉన్నది మోదీ పార్టీ కావడంతో కాంగ్రెస్‌తో  పోలిస్తే బీజేపీపైనే అన్ని రాజకీయ పార్టీలు ఒకటేతీరు అనిపిస్తుంది. అయినా అమ్ముకునేవారు, కొనుక్కునేవారు ఇద్దరూ ఇంత అగాధానికి జారుతారా అనిపిస్తుంది. ఇదే ప్రజాస్వామ్యం అంటే ఒప్పుకుందామా? ఓటరు ప్రవర్తన ఏకాభిప్రాయం ఏమిటంటే, తమ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓటు వేసినవారు సొంతంగా నిర్ణయించుకున్నారట. అది వారి సిద్ధాంతం అట. ఎంపీలైపోవడానికి ఎమ్మెల్యేలు చేసిన పనులు సిగ్గు సిగ్గు. 

1783లో మార్క్విస్ డి కాండోర్సెట్ అనే ఫ్రెంచ్ ప్రముఖ రచయిత పేర్కొన్న ప్రజాప్రతినిధుల ప్రాధాన్యతలు వేరు అని.. హిందూ దినపత్రిక, హిందూ బిజినెస్  లైన్ కింద మార్చి 1, 2024న తెలిపారు. ప్రాధా న్యతలు వేరు, వ్యక్తిగత విషయాలు వేరు అంటారాయన. విప్​ల గురించి వ్యాఖ్యానించారు. మేరీ జీన్ ఆంటోయిన్ నికోలస్ డి కారిటాట్, మార్క్విస్ ఆఫ్ కాండోర్సెట్ ఫ్రెంచ్ పౌరుడు. గణిత శాస్త్రజ్ఞుడు. ఆయన ఆలోచనలు ఉదారవాద ఆర్థిక వ్యవస్థకు మద్దతు, ఉచిత సమానత ప్రజాబోధన, రాజ్యాంగ ప్రభుత్వం అన్ని జాతుల ప్రజలకు సమాన హక్కులు ఉండాలనేవాడు.  జ్ఞానోదయం హేతువాదం అని పుస్తకం రాసాడు. ఆయన ప్రతిపాదనను వ్యతిరేకించే  జాకోబిన్ వర్గం వ్యక్తులు కాండోర్సెట్‌ను అరెస్టు చేయాలని ఓటు వేశారు. చివరకు ఫ్రెంచ్ విప్లవ అధికారుల నుంచి దాగి ఉండడానికి ప్రయత్నించి, ఆ తరువాత కాలంలో జైలులో మరణించాడు. 

స్వేచ్ఛా సంకల్పం వర్సెస్​ కొరడా

ఈ దేశ శాసన నిర్మాతలు ( ఎమ్మెల్యేలు, ఎంపీలు) ఒక మాట చెబుతూ ఉంటారు. అది కొరడా. దాన్ని ఇంగ్లీషులో  విప్​ అంటారు. ఒకాయన స్వేచ్ఛా సంకల్పం వర్సెస్ కొరడాలు అని వివరించారు.  బ్రహ్మాండం. నిజంగా ఆలోచనకు  ప్రధానమైనది స్వేచ్ఛా సంకల్పం.  ఒక అమెరికన్ ఆర్థికవేత్త, ఆంథోనీ డౌన్స్, చర్చను దాని తార్కిక వాదాన్ని ఒక మంచిగా ముగించేసేందుకు నడిపారు. అసలు అటువంటి మంచిపని చేసేవారు తక్కువ మంది, ఓటింగ్ ఖర్చు దాని ప్రయోజనాలను మించిపోతుందని చెప్పాడు. కాగా, హిమాచల్, కర్ణాటకలో పార్టీ విప్‌ను ధిక్కరించకుండా ఉండేందుకు అయ్యే ఖర్చు దానిని ధిక్కరించడం కంటే ఎక్కువగా ఉండవచ్చు. అందుకే క్రాస్ ఓటింగ్.  ధిక్కరణ ఖర్చు ఏమిటో మాకు తెలుసు,- ఎమ్మెల్యేగా తొలగింపు. పోతే పోయింది. కలిగిన లాభాలు చూసుకుంటే సరి. 

విప్​ ప్రయోజనాలూ తెలియవట

మరొకటి కర్ర అంటే భయం. ఏమైపోతుందో అని ప్రభుత్వం భయం. సీబీఐ, ఎన్​ఐఏ, ఈడీ కాకపోతే మరో బోడి పెద్దల భయం. ఇక ప్రజాస్వామ్యం ఉందా సిగ్గు అని ప్రతి వాక్యానికి అనాల్సిందే. పార్టీ విప్‌ను పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో కూడా చాలామందికి తెలియదట. ఎమ్మెల్యే పదవి పోతే పోయింది ఫరవాలేదనే అహంకారులు బోలెడంత మంది. అది ధైర్యం కాదు. పిరికివాళ్లు దేశాన్ని ఏం చేస్తారు?  నిజానికి ఒక మామూలు పోలీసు ఏం చేస్తాడు?  ఠాగూర్ సినిమాలో ఒక సామాన్యుడైన చిన్న పోలీస్ కానిస్టేబుల్ ప్రకాశ్ రాజ్ చేసిన ప్రయత్నం పెద్ద పని. చివరకు ఆయన వల్లనే ఠాగూర్ ను పట్టుకుంటారు. పెద్ద పెద్ద అధికారులు ఏం చేయలేకపోయారు. ఇక పోలీసులు ఏం చేస్తారని వదిలేస్తే ఏమీ చేయలేం?. 

350 ఏండ్ల క్రితమే విప్​ల జారీ విధానం

ఎంపీలైనా లేదా మంత్రులైనా ఐఏఎస్, ఐపీఎస్, తదితరులు పిరికివాళ్లుగా ఉంటే ఏం లాభం. నేరం చేస్తుంటే, హమ్మో వాళ్లు చాలా పెద్దవాళ్లు అని నోరు మూసుకుని కానీలే అనుకుంటే ఏం చేస్తాం. ఐపీసీ ఏం చేస్తుంది. సవరించినా పేరు మార్చినా ఏం చేస్తుంది. ఇది భారత్ అన్నా, ఇండియా అన్నా ఒక్కటే.  ప్రజాస్వామ్యం, నైతికత, భావజాలం, క్రమశిక్షణ ఇవన్నీ పిచ్చిమాటలు.

మధ్యలో రాజ్యాంగం అరుపులు. కొరడాలు అంటే భయపడిపోతారని కాదు. ఎమ్మెల్యే పదవిపోతే మళ్లీ ఏదో పదవి ఇస్తారు. మినిస్టర్ అవుతారు. ఇక ఫిరాయింపు అనే కంపు ఇంపుగా, సొంపుగా ఉంటుంది. దాదాపు 350 ఏండ్ల క్రితం నుంచి విప్‌లు జారీ చేసే విధానం వచ్చిందంటారు. ఓటింగ్ అరాచకాలు నిరోధించడమే వారి పని అట. ఏం కేసు ఏమిటంటే, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు, సొంతంగా రాజీనామా చేసి రాజీ పడడం అని అరాచకం కాదనుకుంటారు. అంటారు,  ప్రకటిస్తారు. బహిరంగ సభలు పెట్టి వివరిస్తారు. ప్రెస్ కాన్ఫరెన్స్ ఇదివరకు ఉండేవి. 

మెరుపులూ చూస్తున్నాం

అమ్ముతారు. కొనుక్కొంటారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి. వారిపైన వాళ్లు కూడా అంతే. ఇక న్యాయమూర్తులు. మూర్తీత్వం నిండిన ధర్మాసన చైతన్యులు.  వారు అందరూ మనం రాజ్యాంగాన్ని రక్షిస్తూ ఉంటారని నమ్ముతున్నాం. అప్పుడప్పుడు మెరుపులు చూస్తున్నాం. మెరుపులు, పిడుగులు కలిసి అప్పుడప్పడు చూస్తున్నాం. వింటున్నాం. ఎప్పుడో అయిదేండ్ల ఎమ్మెల్యే పదవీకాలం అయిపోయిన తరువాత, అదేవిధంగా పదేండ్లు పరిపాలించిన తరువాత, మెరుపులు పిడుగులు ఎవరికి గుర్తుంటాయి.  ఏరోజైనా ఎన్నికల్లో సరైన పోలింగ్ జరిగితే, గెలిస్తే న్యాయం కొంచెమైనా వస్తుందని పౌరులు ఆశిస్తున్నారు.

ప్రజాస్వామ్య దేశాల్లో అప్రజాస్వామికం

‘ఎన్నికైన శాసనసభ్యుడు తన పార్టీ ప్రతిపాదించిన చెడు చట్టానికి లేదా అభ్యర్థికి వ్యతిరేకంగా ఎందుకు ఓటు వేయకూడదు? విప్‌లు లేకపోవడం వల్ల పరిస్థితులు మరింత ప్రజాస్వామ్యం కాదా?’ అని ఓ మహానుభావుడు వాదిస్తున్నాడు. దుర్యోధనుడు కూడా ఈ విధంగా వాదిస్తాడు. రావణాసురుడు అదే అంటాడు. అత్యంత ప్రజాస్వామ్య దేశాలు కూడా అప్రజాస్వామికంగా ప్రవర్తించడం ప్రారంభించాయి.

ఆమె లేక ఆయన కోరుకున్నట్టు ఓటు వేయడానికి వీల్లేదు. ఏమనుకుంటున్నారో.  మన భారతదేశం (రాజ్యాంగం అనాల్నో, సంవిధానం అనాల్నో,  విధానమా, లేక రాజ్యాంగపు ఇండియా అందామా లేక సంవిధాన భారతమా. మహాభారతమో, కురుక్షేత్రమో. ధర్మ క్షేత్రమో లేక కర్మ క్షేత్రమో తెలియదు, క్షమించండి)లో  ఫిరాయింపుల నిరోధక చట్టం ఈ అప్రజాస్వామిక పద్ధతిని రాజ్యాంగంలో పదో షెడ్యూల్​ను ఇరికించి వేసాం. తాంబూలాలు ఇచ్చాం కొట్టుకు చావండి అని గురజాడ అప్పారావు అన్నట్టు.. ఏం చేస్తారు చెప్పండి? సంవిధానం సరే, విధానం ఇది.  ప్రభుత్వ విధానం, వారిని నడిపే సిద్ధాంతం వారిది. ఇక ప్రతిపక్షమే లేదు. 

Also Read: గులాబీ కోటపై.. కాంగ్రెస్, బీజేపీ గురి

అమ్ముకునేవారు ఎక్కువైతే..

అమ్ముకునేవారు ఎక్కువైన తరువాత రాబోయే రోజుల్లో  పార్లమెంటులో మొత్తం రాజ్యసభలో, లోక్​సభలో వాళ్లే ఉంటారు.  మహారాష్ట్రలో ఉన్నట్టు ఒక్క  ప్రెసిడెంట్​గాక ఎమ్మేల్యేలు అందరూ బీజేపీలో చేరిన తరువాత, సుప్రీంకోర్టు మాత్రం ఏం చేస్తుంది?. అక్కడ విప్​లు ఉండవు. ఇక మిగిలింది ఎమ్మేల్యేలు, ఎంపీలు.  పెత్తందారులు వాళ్లే,  కొత్తందారులు వాళ్లే.  సకల సంపదను సృష్టించేవారు వాళ్లే.

 అత్యధిక సంపన్నులు వారే. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అని రాసుకుంటున్నారుగాని నిజంగా ఎవరికీ సంచలనం లేదు. హిమాచల్ ప్రదేశ్ క్రాస్ ఓటింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అంటున్నారట.. క్రాస్ ఓటింగ్ అంశం నుంచి కాంగ్రెస్ పారిపోవడం లేదు అని. క్రాస్ ఓటింగ్ జరిగింది నిజమేనని అద్భుత సత్య సుభాషితం చెప్పాడు.  అయితే.. ఇది ఎందుకు, ఎలా జరిగిందో తెలుసుకుంటున్నారట. ఇదింకో అద్భుతం. ఇది కూడా తెలియకపోతే ఎందుకు రాజకీయాల్లో ఉండడం.

మాడభూషి శ్రీధర్,యూనివర్సిటీ ఆఫ్​ లా ప్రొఫెసర్