- భువనగిరి మున్సిపాలిటీలో కౌన్సిలర్ల క్రాస్ ఓటింగ్
యాదాద్రి, వెలుగు : క్రాస్ ఓటింగ్, ఇంటర్నల్ఒప్పందంతో భువనగిరి మున్సిపల్ చైర్మన్ పదవిని కాంగ్రెస్, వైస్ చైర్మన్ పదవిని బీజేపీ కైవసం చేసుకున్నాయి. సొంత పార్టీ కౌన్సిలర్ల అవిశ్వాసం కారణంగా భువనగిరి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ల పదవులను బీఆర్ఎస్ కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నికల కమిషన్ కమిషన్ ఆదేశాల మేరకు ప్రిసైడింగ్ ఆఫీసర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ చైర్మన్, వైస్ చైర్మన్ల పదవులకు బుధవారం ఎన్నికలు నిర్వహించారు.
క్యాంపుల నుంచి నేరుగా..
చైర్మన్, వైస్ చైర్మన్ల పదవులను దక్కించుకోవడం కోసం క్యాంపులకు వెళ్లిన కాంగ్రెస్, బీఆర్ఎస్ అసమ్మతి కౌన్సిలర్లు బుధవారం నేరుగా వాహనాల్లో మున్సిపాలిటీకి వచ్చారు. మీటింగ్ హాలుకు చేరుకున్న కౌన్సిలర్లు పార్టీల వారీగా కేటాయించిన సీట్లలో కూర్చోగానే వారితో సంతకాలు తీసుకున్నారు. ఎక్స్ అఫీషియో ఓటుతో కలిపి 36 మంది మీటింగ్‌కు రావాల్సి ఉండగా 30 మంది వచ్చారు.
ఎక్స్అఫిషియో మెంబరైన ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి సహా కాంగ్రెస్ నుంచి 12 మంది వచ్చారు. బీఆర్ఎస్ 9, బీజేపీ 7, ఇద్దరు ఇండిపెండెంట్లు మీటింగ్‌కు వచ్చారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించిన రూల్స్‌ను ప్రిసైడింగ్ ఆఫీసర్ జయశ్రీ చదివి విన్పించారు. అనంతరం చైర్మన్‌గా పోటీ చేసే వారిని ప్రతిపాదించాలని సూచించారు.
క్రాస్‌ఓటింగ్ .. చైర్మన్ కాంగ్రెస్‌కు..
దీంతో కాంగ్రెస్ తరఫున పోతంశెట్టి వెంకటేశ్వర్లు, బీజేపీ తరపున బొర్ర రాకేశ్ పేర్లను తోటి కౌన్సిలర్లు ప్రతిపాదించి బలపర్చారు. అనంతరం చేతులెత్తే పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. దీంతో కాంగ్రెస్‌కు అనుకూలంగా బీజేపీ కౌన్సిలర్ ఊదరి లక్ష్మి, బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవంతిక, అరుణ, వెంకట్ నాయక్ ఓటేశారు. వీరితో పాటు ఇండిపెండెంట్లు అంజమ్మ, అనురాధ, ఎక్స్ అఫీషియో మెంబరైన ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, 11 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు ఓటేశారు. కాంగ్రెస్ అభ్యర్థికి 18 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థికి ఆరు ఓట్లు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి పోతంశెట్టి వెంకటేశ్వర్లు చైర్మన్‌గా ఎన్నికైనట్టు ప్రిసైడింగ్ఆఫీసర్ ప్రకటించారు.
కాంగ్రెస్‌కు రెండుమార్లు ఓటింగ్
చైర్మన్ ఎన్నిక సందర్భంగా మీటింగ్‌లో ఓ ట్విస్ట్ జరిగింది. ప్రిసైడింగ్ఆఫీసర్ జయశ్రీ కాంగ్రెస్‌కు రెండుమార్లు ఓటింగ్ నిర్వహించారు. అభ్యర్థిని కాంగ్రెస్ ప్రతిపాదించి, బలపరచగానే.. చేయిలేపి ఓటు వేయాలని ప్రిసైడింగ్ ఆఫీసర్ సూచించారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి పోతంశెట్టి వెంకటేశ్వర్లుకు 18 మంది ఓటేశారు. అనంతరం బీఆర్ఎస్ అభ్యర్థిని సూచించాలని ప్రిసైడింగ్ఆఫీసర్ చెప్పారు. దీంతో బీజేపీ కౌన్సిలర్రత్నపురం బలరాం అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్షరమాల ప్రకారం ముందుగా బీజేపీకి ఎన్నిక నిర్వహించాలని చెప్పారు. దీంతో ముందు బీజేపీకి ఓటింగ్ నిర్వహించి అనంతరం మరోసారి కాంగ్రెస్‌కు ఓటింగ్ నిర్వహించారు.
కౌన్సిలర్ పదవికి రాజీనామా
వైస్ చైర్మన్ పదవికి కాంగ్రెస్ పోటీ చేయకపోవడాన్ని నిరసిస్తూ కౌన్సిలర్ ప్రమోద్‌కుమార్ మీటింగ్‌నుంచి వెళ్లిపోగా.. ఎన్నిక ముగిసిన తర్వాత 20 వ వార్డు కౌన్సిలర్ పచ్చల హేమలత తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఇన్చార్జ్ కమిషనర్ కొండల్రావుకు రాజీనామా పత్రాన్ని అందించారు. తమను ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి పట్టించుకోవడం లేదనిచ త్వరలో కాంగ్రెస్‌కు కూడా రాజీనామా చేస్తానని తెలిపారు.
కాంగ్రెస్ మౌనం.. వైస్ చైర్మన్ పదవి బీజేపీకి..
చైర్మన్ ఎన్నిక అనంతరం వైస్ చైర్మన్ ఎన్నిక కోసం అభ్యర్థులను ప్రతిపాదించాలని ప్రిసైడింగ్ ఆఫీసర్ సూచించారు. బీజేపీ కౌన్సిలర్లు మాయ దశరథ పేరును ప్రతిపాదించి బలపరచారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కౌన్సిలర్ పోత్నక్ ప్రమోద్‌కుమార్ ఎమ్మెల్యేను ఉద్దేశించి మాట్లాడబోయారు. ఆయన మౌనంగా ఉండమని సూచించడంతో ప్రమోద్ కుమార్అసహనంగా మీటింగ్ నుంచి వెళ్లిపోయారు. ఆరుగురు బీఆర్ఎస్ సభ్యులు కూడా బయటకు వెళ్లిపోయారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నుంచి ఎవరూ పోటీ చేయకపోవడంతో వైస్ చైర్మన్‌గా బీజేపీ కౌన్సిలర్మాయ దశరథ ఎన్నికైనట్టు ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రకటించారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్‌తో ప్రమాణం చేయించారు.