
కొమురవెల్లి, వెలుగు: మల్లన్న ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మారుమోగాయి. శనివారం రాత్రి నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు ఆదివారం ఉదయం స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. అర్చనలు, అభిషేకాలు, పట్నాలు వేసి ఒడిబియ్యం పోసి గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి బోనాలు చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం మల్లన్న గుట్టపై ఉన్న ఎల్లమ్మ తల్లిని దర్శించుకొని మట్టి పాత్రలతో బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మరికొందరు రాతిగీరల వద్ద ప్రదక్షిణలు, కోడెల స్తంభం వద్ద కోడెలు కట్టి పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో బాలాజీశర్మ, ఏఈవో అంజయ్య, ఆలయ ప్రధానార్చకుడు మల్లికార్జున్, సూపరింటెండెంట్ శేఖర్, ఆలయ సిబ్బంది, అర్చకులు, ఓగ్గుపూజారులు పాల్గొన్నారు.