
తిరుపతి : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవులు కావడం, వీకెండ్ కావడంతో కలియుగ దైవమైన శ్రీవెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. దీంతో శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటలు సమయం పడుతుంది. తిరుమలలో ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. మరో రెండు వారాల పాటు ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇక నిన్న ( ఏప్రిల్ 13) శ్రీవారిని 82 వేల 139 మంది భక్తులు దర్శించుకోగా.. 39 వేల 849 మంది తలనీలాలు ఇచ్చారు . హుండీ ఆదాయం రూ. 3 కోట్ల 97 లక్షలు వచ్చినట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఇక క్యూలైన్ లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ అన్నప్రసాదం,పాలు, మజ్జిగ అందిస్తోంది. క్యూలైన్ లో ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది టీటీడీ.