
- రెండో రోజు జాతరలో భక్తుల రద్దీ
- మొక్కులు చెల్లించుకున్న భక్తులు
- కన్నుల పండువగా బండ్ల ఊరేగింపు
మెదక్, పాపన్నపేట, కొల్చారం, వెలుగు : డప్పుల దరువులు, శివసత్తుల శిగాలు, పోత రాజుల విన్యాసాలతో ఏడుపాయల మార్మోగింది. జాతర వేడుకల్లో రెండో రోజైన శనివారం భక్తుల రద్దీ పెరిగింది. కొత్త కుండకు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, పైన గండ దీపం వెలిగించిన బోనం నెత్తిన ఎత్తుకుని డప్పు చప్పుళ్ల మధ్య వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఏడుపాయలలో ఎటు చూసినా బోనాల సందడే కనిపించింది. కొందరు భక్తులు తొట్టెలను ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారి ఆలయంలో కట్టారు.
తెలంగాణలోని వివిధ జిల్లాలు, హైదరాబాద్, కర్నాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి వన దుర్గా మాతను దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా జాతరకు వచ్చిన వారు మేకలు, కోళ్లు కోసుకొని దావత్ లు చేసుకున్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య శనివారం వనదుర్గా భవాని మాతను దర్శించుకుని పూజలు చేశారు.
బండెనక బండి కట్టి..
ఏడుపాయల జాతరలో ప్రధాన ఘట్టమైన బండ్ల ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. ఆనవాయితీ ప్రకారం పాపన్నపేట సంస్థానాధీశుల బండి ముందు ఏడుపాయల ఆలయ చైర్మన్ బాలాగౌడ్, ఈవో మోహన్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి, పూజలు చేసి బండ్ల ఊరేగింపును ప్రారంభించారు. పాపన్నపేట, టేక్మాల్, ఆల్లాదుర్గం, కొల్చారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఎడ్ల, గుమ్మటాల బండ్లు అధిక సంఖ్యలో ఊరేగింపులో పాల్గొన్నాయి. బండ్లను రంగురంగుల చీరలు, మామిడి తోరణాలు, వేపకొమ్మలతో అలంకరించగా, బంగారు రంగు మెరుపు కాగితాలు
దేవుళ్ల ఫొటోలతో అలంకరించిన గుమ్మటాల బండ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నాగ్సాన్ పల్లి నుంచి ప్రారంభమైన బండ్ల ఊరేగింపు ఏడుపాయల్లోని మెయిన్‌రోడ్డు మీదుగా రాజగోపురం ముందునుంచి సాగింది. బండ్ల ఊరేగింపును తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో జాతర ప్రాంగణం కిటకిటలాడింది. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.