ఎములాడ, మేడారంలో భక్తుల రద్దీ

ఎములాడ, మేడారంలో భక్తుల రద్దీ

తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. మినీ జాతర సమీపిస్తుండడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తుల పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జంపన్నవాగులో స్నానాలు చేసిన అనంతరం అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకొని దర్శనం చేసుకున్నారు. ఎత్తుబంగారం, ఎదురు కోళ్లు, చీర, సారె, పసుపు, కుంకుమ సమర్పించి, ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అడవిలో వంటవార్పు చేసుకొని అక్కడే భోజనాలు చేశారు. 

శివనామస్మరణతో మారుమోగిన రాజన్న ఆలయం

వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం శివనామస్మరణతో మారుమోగింది. సోమవారం కావడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయన్నే ఆలయ ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు అనంతరం స్వామివారిని దర్శించుకొని, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. మరో వైపు ఆలయంలో ప్రాతఃకాల పూజ, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో వినోద్‌‌‌‌రెడ్డి, ఆఫీసర్లు ప్రత్యేక చర్యలు చేపట్టారు.