వరుస సెలవులు రావడంతో రాష్ట్రంలోని ఆలయాలకు భక్తుల తాకిడి

వరుస సెలవులు రావడంతో రాష్ట్రంలోని ఆలయాలకు భక్తుల తాకిడి
  • మేడారంలో ముందస్తు మొక్కులకు తరలివచ్చిన భక్తులు
  • యాదగిరిగుట్ట, వేములవాడ, కొమురవెల్లిలో పెరిగిన రద్దీ

తాడ్వాయి/యాదగిరిగుట్ట/వేములవాడ/కొమురవెల్లి, వెలుగు : వరుస సెలవులు రావడంతో రాష్ట్రంలోని పలు ఆలయాలకు భక్తుల తాకిడి పెరిగింది. మేడారం, యాదగిరిగుట్ట, వేములవాడతో పాటు కొమురవెల్లికి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం ఆలయ పరిసరాలు ఆదివారం భక్తులతో కిక్కిరిశాయి.

మినీ మేడారం జాతర మరో పది రోజులే ఉండడంతో ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా జంపన్నవాగులో పుణ్య స్నానాలు చేసిన అనంతరం ఎత్తు బంగారంతో అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకున్నారు. బంగారంతో పాటు పసుపు, కుంకుమ, చీర సారె, పూలు పండ్లు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం ఒక్కరోజే 70 వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారని ఎండోమెంట్‌‌‌‌ ఆఫీసర్లు తెలిపారు.

యాదగిరిగుట్టలో పెరిగిన రద్దీ

హైదరాబాద్‌‌‌‌ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భక్తులు ఆదివారం యాదగిరిగుట్టకు తరలివచ్చారు. భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోగా, స్వామివారి ధర్మదర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. రద్దీ కారణంగా కొండ కింద కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, వ్రత మండపాలు, కొండపైన బస్‌‌‌‌బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు, ప్రధానాలయ ప్రాంగణం కిటకిటలాడాయి.

భక్తులు జరిపించిన పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆదివారం ఆలయానికి రూ.45,73,274 ఆదాయం సమకూరింది. అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా రూ.16,39,120, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.6 లక్షలు, వీఐపీ దర్శనాల ద్వారా రూ.9.15 లక్షలు, బ్రేక్ దర్శనాలతో రూ.4,28,400 ఇన్‌‌‌‌కం వచ్చిన ఆఫీసర్లు తెలిపారు.

రాజన్న, మల్లన్న ఆలయాల్లో...

వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం, కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయాలు ఆదివారం భక్తులతో నిండిపోయాయి. శనివారం రాత్రే వేములవాడకు చేరుకున్న భక్తులు ఆదివారం ఉదయం తలనీలాలు సమర్పించి, ధర్మగుండంలో స్నానమాచరించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకొని, కోడె మొక్కులు చెల్లించుకున్నారు.

మరో వైపు కొమురవెల్లి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో వారమైన ఆదివారం 50 వేల నుంచి 60 వేల మంది భక్తులు తరలివచ్చారు. దీంతో స్వామివారి దర్శనానికి నాలుగు గంటల టైం పట్టింది. కొమురవెల్లికి వచ్చిన భక్తులు ముందుగా గంగిరేగు చెట్టు, ముఖ మంటపం వద్ద పట్నాలు వేసి బోనాలు సమర్పించారు. అనంతరం మల్లన్న గుట్టపైన కొలువైన ఎల్లమ్మకు బోనాలు సమర్పించారు.