మెదక్/పాపన్నపేట, వెలుగు : మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల బుధవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. మాఘ అమావాస్య సందర్భంగా ఉత్తర వాహిణిగా ప్రవహించే మంజీరా నది పాయల్లో పుణ్యస్నానాలు చేసేందుకు ఉమ్మడి మెదక్‌తో పాటు హైదరాబాద్, కర్నాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఘనపూర్ ఆనకట్ట వద్ద, నదీపాయల వెంట ఏర్పాటు చేసిన షవర్ల వద్ద భక్తులు పుణ్యస్నానాలు చేసిన అనంతరం వనదుర్గా భవానీని దర్శించుకున్నారు. పలువురు భక్తులు బోనాలు తీసి, ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. రద్దీ ఎక్కువగా ఉండడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు చాలా సేపు క్యూలో వేచి ఉండాల్సి వచ్చింది.
రాత్రి వరకు రద్దీ కొనసాగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సౌకర్యాలు కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మెదక్ డీఎస్పీ ఆధ్వర్యంలో 200 మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. వందల సంఖ్యలో వెహికల్స్ తరలిరావడంతో మెదక్– హైదరాబాద్ హైవే నుంచి ఏడుపాయల వరకు దాదాపు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. అడిషనల్ కలెక్టర్ నగేశ్ ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.