రాజన్న సన్నిధిలో భక్తుల కిటకిట.. రద్దీగా ఆలయ పరిసరాలు

వేములవాడ రూరల్, వెలుగు: వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. తొలుత ధర్మగుండంలో పవిత్రస్నానాలు ఆచరించి క్యూలైన్లలో ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు.  వేసవి సెలవులు పూర్తవుతున్నందున రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు రాజన్న సన్నిధికి తరలివచ్చారు. సోమవారం స్వామివారి దర్శనం కోసం ఆదివారం సాయంత్రమే చేరుకున్నారు. 

ఆలయ కల్యాణ కట్ట వద్ద భక్తులు తలనీలాల సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి ఎంతో ఇష్టమైన కోడెమొక్కు చెల్లించుకునేందుకు భక్తులు బారులుదీరారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు రద్దీగా మారాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.