భక్తులతో గుట్ట కిటకిట.. ధర్మదర్శనానికి 3, ప్రత్యేక దర్శనానికి గంట

  • ఒక్కరోజే రూ.46.63 లక్షల ఆదాయం

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సెలవు రోజు కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు యాదగిరిగుట్టకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. నారసింహుడి ఉచిత దర్శనానికి 3 గంటలు, స్పెషల్  దర్శనానికి గంట సమయం పట్టింది.  కొండ కింద కల్యాణకట్ట, లక్ష్మి పుష్కరిణి, సత్యనారాయణస్వామి వ్రత మండపం, పార్కింగ్ ప్రదేశం.. కొండపైన బస్ బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు భక్తులతో కిక్కిరిశాయి. ఆలయంలో నిర్వహించిన స్వామివారి నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమంలో భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక భక్తులు జరిపించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆదివారం ఆలయానికి రూ.46,63,688 ఆదాయం వచ్చింది.  ప్రసాద విక్రయం ద్వారా రూ.20,84,900, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.6.50 లక్షలు, వీఐపీ టికెట్ల ద్వారా రూ.4.50 లక్షలు, బ్రేక్  దర్శనాలతో రూ.3,54,600, ప్రధాన బుకింగ్  ద్వారా రూ.2,07,250 ఆదాయం వచ్చిందని ఆలయ ఆఫీసర్లు వెల్లడించారు.

యాదాద్రీశుడిని దర్శించుకున్న త్రిపుర హైకోర్టు జడ్జి

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని ఆదివారం త్రిపుర రాష్ట్ర హైకోర్టు జడ్జి అమర్నాథ్  గౌడ్  తన కుటుంబంతో కలిసి దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు సంప్రదాయ రీతిలో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం అద్దాల మండపంలో అర్చకులు ఆయనకు ఆశీర్వచనం చేయగా.. ఆలయ సూపరింటెండెంట్ రాజన్ బాబు లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు.