వేములవాడ, వెలుగు : వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమా శంకర్ శర్మ అధ్వర్యంలో అర్చకులు స్వామికి రుద్రాభిషేకం నిర్వహించారు. ఉదయం నుంచే స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు వరంగల్, నిజమబాద్, అదిలాబాద్, హైదరాబాద్ నుంచి భక్తులు తరలివచ్చారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఈఓగా వినోద్ రెడ్డి..
రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఈఓ గా సోమవారనం కె. వినోద్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్లో గణేశ్ టెంపుల్ ఈఓ గా పనిచేస్తున్న వినోద్ రెడ్డి రాజన్న ఆలయ ఈఓ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ ఈఓ గా పనిచేస్తున్న రామకృష్ణ రిలీవ్ అయ్యారు. కొత్తగా వచ్చిన ఈఓ వినోద్ రెడ్డి స్వామివారిని దర్శనం చేసుకొని, ఆలయ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈఈ రాజేశ్, డీఈ రఘునందన్, ఏఈఓ లు హరికిషన్, ప్రతాప నవీన్, బ్రాహ్మణ గారి శ్రీనివాస్, ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు, నటరాజ్ , నాగుల మహేశ్ పాల్గొన్నారు.