Diwali 2024 : కాకి పిల్ల.. దీపావళి కథ.. మీ పిల్లలకు చెప్పండి.. !

Diwali 2024 : కాకి పిల్ల.. దీపావళి కథ.. మీ పిల్లలకు చెప్పండి.. !

దీపావళి పండుగ రోజు ఉదయమే  .. హేలాపురి పట్టణంలో  చిన్నా పెద్దా అంతా కొత్త బట్టలు కట్టుకొని పండుగ హడావిడి చేస్తారు.  ఆ రోజున అడవిలో చెట్టు మీద గూడు కట్టుకుని ఉంటున్న తల్లి కాకిని దాని పిల్ల "అమ్మా! పూర్వం మన కాకి జాతి వాళ్ళం మనుషులతో కలిసి పట్టణాల్లో, నగరాల్లో ఉండే వాళ్లమట కదా! మరి ఇప్పుడు మన జాతివాళ్ళం అడవిలోకి ఎందుకు వచ్చేశాం?" అని అడిగింది.

"అవునమ్మా! మన పూర్వీకులు నగరాల్లో, పట్టణాల్లో మనుషులతో కలిసి జీవించిన మాట నిజమే. అప్పుడు నగరాల్లో, పట్టణాల్లో పెద్ద పెద్ద చెట్లు అనేకం. ఉండేవి. వేలాదిగా ఉన్న ఆ చెట్లమీద గూళ్ళు కట్టుకుని ఉండేవాళ్ళు మన వాళ్ళు. కానీ జనం ఆ చెట్లన్నీ కొట్టేసి పెద్ద పెద్ద బిల్డింగ్స్, అపార్టుమెంట్స్ కట్టుకున్నారు. దాంతో గూళ్లు కట్టుకోవడానికి చెట్లు లేక మనం ఇలా అడవిలోకి వచ్చేశాం"  చెప్పింది.

తల్లి కాకి "అలాగా! ...అయితే మన పూర్వీకులు నివసించిన ఆ పట్టణం ఎలా ఉంటుందో ఓ సార్ వెళ్లి చూసి రావాలని ఉందమ్మా వెళ్లనా!?" అని అడిగింది పిల్ల "అలాగే వెళుదువు గానిలే. అసలే నువ్వు అల్లరి దానివి.. ఏపిచ్చి పనీ చెయ్యకుండా బుద్ధిగా తిరిగి రావాలి మరి" అన్నది తల్లి. "అలాగేనమ్మా!" అని ఆ పిల్ల కాకి ఉత్సాహంగా అక్కడకు దగ్గరలో ఉన్న  హేలాపురి పట్టణం వైపు ఎగురుకుంటూ వెళ్ళింది. అలా అది ఆకాశంలో ఎగురుకుంటూ వెళుతుంటే, ఇంటి ముందు చిన్న పిల్లవాడు ఆ రోజు రాత్రికి కాల్చుకోవడానికి ఎండ బెట్టుకున్న దీపావళి టపాకాయలు కనిపించాయి. అవి కొన్ని పొడుగ్గా, కొన్ని గుండ్రంగా, కొన్ని శంఖం ఆకారంలో రకరకాలుగా ఉన్నాయి. అవేమిటో, వాటితో ఏం చేస్తారో అర్థం కాలేదు ఆ పిల్ల కాకికి. దాంతో అది ఆ ఇంటి గోడ మీద వాలి వాటినే పరిశీలనగా చూస్తూ కూర్చుంది.

కొంతసేపటి తరువాత ఆ ఇంట్లో నుంచి చిన్న కుర్రాడు బయటికి వచ్చి ఎండబెట్టిన కాకరపువ్వొత్తుల పెట్టెలోంచి కాకర పువ్వొత్తి బయటికి తీసి అది బాగా వెలుగుతుందో లేదో అని చూడడానికి అగ్గి పుల్లతో దాన్ని వెలిగించాడు. ఎండకి బాగా ఎండిన ఆ కాకరపువ్వొత్తి చురచురా కాలడం చూసి ఆ కుర్రాడు. ఆనందించాడు. కాకిపిల్లకి అది వింతగా అనిపించింది. ఆ కుర్రాడు ఇంట్లోకి పోగానే కాకిపిల్ల ఆ కాకరపువ్వొత్తుల పెట్టెలోనుండి ఒక కాకరపువ్వొత్తిని నోట కరుచుకుని ఎగురుకుంటూ అడవిలోని గూటికి పోయి దాన్ని గూట్లో దాచేసింది.. రాత్రి అయ్యేసరికి పట్టణం వైపున్న ఆకాశంలో టపాకాయల వెలుగు, పేలుళ్లు  వినిపించాయి.

చెట్టుపై నుండి పైకెగిరిన కాకిపిల్ల నగరం వైపు చూస్తే పట్టణమంతా పేలుతున్న పటాకులు వెలుగులో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. పిల్లలు, పెద్దలు అందరూ పటాకులు కాలుస్తూ ఆనందంగా దీపావళి పండుగ చేసుకుంటున్నారు. పట్టణం అంతా వెలుగుతో నిండిపోతే తమ అడవి మాత్రం ఏ వెలుగూ లేక చీకటిలో ఉండిపోవడం కాకిపిల్లకు నచ్చలేదు. దాంతో అది ఊరికి ఈ చివర ఉన్నఓ ఇంటి గోడమీద వెలిగించి ఉన్న కొవ్వొత్తిని ముక్కున కరుచుకుని జాగ్రత్తగా గూటికి తెచ్చింది. ఆ కొవ్వొత్తితో కాకరపువ్వొత్తిని వెలిగించింది. ఆ కాకరపువ్వొత్తి చిటపటలాడుతూ వెలుగుతుంటే కాకిపిల్ల ఆనందించింది. ఇంతలో ఆ కాకిగూటికి మంట అంటుకుంది. అలా అలా ఆ మంట కాస్తా పెద్దదై ఆ చెట్టు మీద ఉన్న వందలాది గూళ్ళకి మంట వ్యాపించింది. ఆ చెట్టు నిలువునా కాలిపోసాగింది.

ఆ చెట్టు మీద ఉన్న కాకులు గోలగోలగా ఎగిరి చెట్టు మీద నుంచి దూరంగా వచ్చేశాయి. తన కారణంగా జరిగిన ఈ గోలంతా చూసి కాకిపిల్లకు చాలా బాధ కలిగింది. తను అమ్మ మాట వినకపోవడం వల్లనే కదా ఇదంతా జరిగింది అని గ్రహించి చాలా బాధపడింది. ఇలా చేసినందుకు తల్లి కాకి చీవాట్లు పెట్టింది పిల్ల కాకిని. ఆ ఘటనతో కాకిపిల్లకి బుద్ధి వచ్చి అప్పట్నుంచీ అల్లరి పనులన్నీ మానేసి అమ్మ చెప్పినట్లుగా నడుచుకోసాగింది.

–వెలుగు, లైఫ్​–