సంహితలో ఎఫ్ఐఆర్​పై స్పష్టత కరువు

ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్​ఐఆర్)​గురించి భారతీయ నాగరిక సురక్ష సంహితలోని సెక్షన్ 173లో  చెప్పారు. అదేవిధంగా ఎఫ్​ఐఆర్​ గురించి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 154లో పేర్కొన్నారు. అయితే,  కేసు నమోదు విషయంలో ఈ రెండింటికీ చాలా భేదాలు ఉన్నాయి. జీరో ఎఫ్ఐఆర్ అనే భావన సెక్షన్ 154లో ఉంది. అలాంటి భావనే స్పష్టంగా సంహితలోని సెక్షన్ 173లో  తెలిపారు. కాగ్నిజబుల్ నేర సమాచారం అందినప్పుడు పోలీసులు, తమ అధికార పరిధితో నిమిత్తం లేకుండా కేసు నమోదు చేయవలసి ఉంటుంది. కోడ్ లోని సెక్షన్ 154లో కాగ్నిజబుల్ నేర సమాచార విషయంలో అధికార పరిధి అనే విషయం ఎక్కడా చెప్పలేదు. సెక్షన్ 154లో నాన్ కాగ్నిజబుల్ నేర సమాచార విషయంలో అధికార పరిధి అనే పదం ఉంది. ఈ రెండింటిని కలిపి చదివినప్పుడు పోలీసులు కాగ్నిజబుల్​నేర సమాచారం అందినప్పుడు తమ అధికార పరిధితో సంబంధం లేకుండా కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ, చాలా సందర్భాలలో పోలీసులు ఆ విధంగా కేసులను నమోదు చేయడం లేదు.  డిసెంబర్ 2012లో  ఢిల్లీలో జరిగిన సామూహిక మానభంగం కేసు తరువాత జీరో ఎఫ్ఐఆర్ అనే భావన తెర మీదకు వచ్చింది.  

స్టేట్ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ పునతి రాములు అండ్​అదర్స్,  ఎ.ఐ.ఆర్ 1993 సుప్రీంకోర్టు 2644  కేసులో  ఎఫ్ఐఆర్  విడుదల చేయటానికి పోలీసు స్టేషనులోని కానిస్టేబుల్ నిరాకరించాడు. ఈ విషయంలో ఎఫ్.ఐ.ఆర్ విడుదల చేయకపోవడానికి ఎలాంటి న్యాయ బాధ్యత అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పింది. కేసు నమోదు చేసి సంబంధిత పోలీసు స్టేషనుకి ఆ కేసును బదిలీ చేస్తే  సరిపోతుందని కూడా సుప్రీంకోర్టు ఈ కేసులో  తెలిపింది. ఆ తరువాత ఈ అధికార పరిధి అనే విషయం సత్ విందర్ కౌర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ కేసులో తమ అధికార పరిధిలో నేరం జరగనప్పటికీ ఢిల్లీ పోలీసులు కేసును నమోదు చేశారు. ఎఫ్.ఐ.ఆర్ ని ఢిల్లీ హైకోర్టు రద్దు చేసింది.  ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు తప్పు పట్టింది. పోలీసులు కేసు నమోదు చేయడంలో తప్పు లేదని తమ అధికార పరిధిలో లేనప్పుడు కేసును సంబంధిత పోలీసు స్టేషనుకి బదిలీ చేయాలని సూచించింది. సంహితలోని సెక్షన్ 173లో అధికార పరిధితో నిమిత్తం లేకుండా కాగ్నిజబుల్ నేర సమాచారం పోలీసు అధికారి అందుకున్నప్పుడు ఎఫ్.ఐ.ఆర్​ని విడుదల చేయాలని సంహితలోని సెక్షన్ 173 స్పష్టంగా చెప్పింది. 

నేరం ఎక్కడ జరిగిందో..ఆ కోర్టు పరిధిలోనే విచారణ

తమ కోర్టు అధికార పరిధిలోని కేసులనే పోలీసులు దర్యాప్తు చేయవలసి ఉంటుందని  కోడ్ లోని సెక్షన్ 156 (1) అదే విధంగా సంహితలోని సెక్షన్ 175 (1) చెబుతున్నది. తమ అధికార పరిధి లేని కేసులో ప్రథమ సమాచార నివేదికను విడుదల చేసిన తర్వాత కేసును సంబంధిత పోలీస్​ స్టేషనుకి పంపించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు నవీన్ చంద్ర ఎన్. మజిత్యా వర్సెస్ ఎస్టేట్ ఆఫ్ మేఘాలయ కేసులో చెప్పింది. అయితే, ఈ విషయాన్ని సంహితలో ఎక్కడా చెప్పలేదు.  అందువల్ల ఎఫ్.ఐ.ఆర్ విడుదల చేసి పోలీసులు కేసును దర్యాప్తు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. తమ అధికార పరిధిలో  లేనప్పటికీ కూడా దర్యాప్తు చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.  సంహితలో సెక్షన్ 187 (2) ప్రకారం ముద్దాయిని రిమాండ్ కు పంపే అవకాశం కూడా ఉంది.  తమ అధికార పరిధిలో  లేకుండా దర్యాప్తు చేయడం చట్ట విరుద్ధం.  ఇది సంహితలోని అధ్యాయం 14 కి విరుద్ధం కూడా. సెక్షన్ 197 ప్రకారం నేరం ఎక్కడ జరిగిందో ఆ కోర్టు పరిధిలోనే విచారణ జరగాలి.  సంహితలోని సెక్షన్ 175 (1) ప్రకారం తమ కోర్టు అధికార పరిధిలోని కేసులనే పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 156 (1) చెబుతోంది. అధికార పరిధిలో లేని పోలీసులు దర్యాప్తు చేయడంవల్ల తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది. 

ALSO READ : విద్యకు 15 శాతం బడ్జెట్ ​కేటాయించాలి

ఎఫ్ఐఆర్ నమోదుపై సంహితలో అస్పష్టత

జీరో  ఎఫ్. ఐ. ఆర్ భావనని తీసుకొని తమకు అనుకూలంగా ఉన్న పోలీసు స్టేషన్లలో కేసులను నమోదు చేయించి దుర్వినియోగం చేసే అవకాశం చాలా ఉంది.  బాధితులు ఎక్కడ ఉంటే అక్కడ ప్రథమ సమాచారాన్ని ఇవ్వవచ్చు.  జీరో  ఎఫ్. ఐ. ఆర్ చాలా గొప్పది అని అనలేం. అలాగని అది పూర్తిగా చెడు చేస్తుందని కూడా అనలేం. సంహితలోని సెక్షన్ 187లో మరో కొత్త  వెసులుబాటుని కూడా కల్పించారు. అదే ఈ- ఎఫ్. ఐ. ఆర్. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా కూడా కాగ్నిజబుల్ నేర సమాచారాన్ని పోలీసులకి పంపించవచ్చు. మూడు రోజుల తరువాత ఆ సమాచారం మీద ఆ సమాచారాన్ని పంపించిన వ్యక్తి సంతకం చేయాల్సి ఉంటుంది. కాగ్నిజబుల్ నేర సమాచారాన్ని ఎవరైనా ఇవ్వవచ్చు. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా సమాచారం ఇచ్చిన వ్యక్తి ఇతరేతర పనుల మీద వేరే పట్టణానికి లేదా వేరే దేశానికి వెళ్ళవచ్చు. అప్పుడు ఆ సమాచారం పరిస్థితి ఏంటి అన్న విషయంపై సంహితలో స్పష్టత లేదు.

నేరం నమోదు చేయకుండానే విచారణ

పోలీసులు దర్యాప్తు చేపట్టనప్పుడు ఆ నేర సమాచారాన్ని పోలీస్ సూపరింటెండెంట్ కి పోస్ట్ ద్వారా రాతపూర్వకంగా పంపించాలి. ఇది ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా పంపించే వెసులుబాటుని సంహిత కల్పించలేదు.  కేసు నమోదు చేయకుండానే ప్రాథమికంగా విచారణ జరపడానికి పోలీసులకి అధికారాన్ని సంహిత కల్పించింది. దీనివల్ల అనేక అనర్థాలు కలిగే అవకాశం ఉంది. అవినీతి కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ నిబంధనకి మార్పులు తేవాలి. కనీసం మన రాష్ట్రంలోనైనా సంహితలోని సెక్షన్ 173కి అదేవిధంగా 187కి మార్పులు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం బిల్లుని ప్రవేశ పెట్టాలి. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకు రావలసిన బాధ్యత అందరి మీద ఉంది. 

జీరో ఎఫ్.ఐ.ఆర్ వల్ల అనర్థాలు 

జీరో ఎఫ్.ఐ.ఆర్ వల్ల ఉపయోగాలతో పాటు నష్టాలూ ఉన్నాయి.  సంహితలోని  కొత్త నిబంధన వల్ల మరీ ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి. ఈ  జీరో ఎఫ్.ఐ.ఆర్​ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది.  తమకు అనుకూలంగా ఉన్న పోలీసు స్టేషనులో  ఎఫ్.ఐ.ఆర్ ని నమోదు చేయించి ముద్దాయిలకి నష్టం కలగజేసే అవకాశం ఉంది. చిమ్లా రావల్ ఇతరులు వర్సెస్ ఎస్టేట్ (ఎన్ సిటి ఢిల్లీ ) మరి ఒకరు 2003 (1) ఎ డబ్ల్యూ సి 344 3 సి, కేసులో ప్రథమ సమాచార నివేదికను ఢిల్లీలో విడుదల చేశారు.  ఫిర్యాదుదారు ఆరోపించిన సంఘటనలన్నీ ముంబైలో జరిగాయి. భార్యాభర్తలు ఇద్దరూ ముంబైలోనే నివసించారు. భార్య కథనం ప్రకారం ఇద్దరూ ఓ మూడు మాసాలు ఢిల్లీలో ఉన్నారు. ఆ తరువాత అతని బంధువులు ఢిల్లీ నుంచి అతన్ని ముంబై తీసుకువెళ్లారు. ఢిల్లీలో ఎలాంటి సంఘటనలు జరగలేదు. ఆ తరువాత భర్త చనిపోయాడన్న సమాచారం ఆమెకు అందింది.  వారి వివాహం అయినది ముంబైలో. ఆరోపించిన సంఘటనలు అన్నీ జరిగింది ముంబైలో.  కానీ,  జీరో  ఎఫ్. ఐ. ఆర్ అన్న భావనని ఉపయోగించి కేసుని ఢిల్లీలో నమోదు చేశారు. పోలీసులు ఆమెతో కుమ్మకై తమ మీద కేసు నమోదు చేశారని ఢిల్లీ హైకోర్టులో వాళ్ళ ఎఫ్. ఐ. ఆర్  రద్దు గురించి రిట్ దాఖలు చేశారు.  కేసుని  విచారించిన హైకోర్టు,  సోనూ అండ్​ అదర్స్​ వర్సెస్ ఎన్ సిటి  ఆఫ్ ఢిల్లీ,  ఇతరులు, డబ్ల్యూసి (క్రిమినల్) నెం. 1266/2007,  తీర్పు తేదీ 10.10.2007 కేసుని, సత్విందర్ కౌర్ వర్సెస్ స్టేట్ (గవర్నమెంట్ ఆఫ్ ఎన్ సిటి ఆఫ్ ఢిల్లీ) (1999) 8 ఎస్ సి సి 728 కేసుని పరిశీలించి పరిగణనలోకి తీసుకొని వాళ్ళ మీద వున్న ప్రథమ సమాచార నివేదికను కొట్టివేసింది. ముంబై పోలీసులకి ప్రథమ సమాచారాన్ని ఇవ్వాలని ఆదేశించింది. 

ALSO READ : ఆహార పంటల ఎగుమతులతోనే..రైతులకు భారీ ఆదాయం

జీరో ఎఫ్.ఐ.ఆర్ ఆవశ్యకత 

రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడు నేరాలు జరిగితే.. అవి ఎక్కడ జరిగాయో తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది. అలాంటి కేసులలో ఈ జీరో  ఎఫ్.ఐ.ఆర్ ఉపయోగపడుతుంది. మహిళల మీద నేరాలు జరిగినప్పుడు వారు తమ దగ్గరలో ఉన్న పోలీస్​స్టేషన్లో  కేసులను నమోదు చేసుకునే వీలు చిక్కుతుంది. అదేవిధంగా హత్య, రేప్, ఆక్సిడెంట్ లాంటి నేరాలు జరిగినప్పుడు  జీరో  ఎఫ్.ఐ.ఆర్ విడుదల చేయడం వల్ల సాక్ష్యాలు  తారుమారు కాకుండా కాపాడడానికి వీలుచిక్కుతుంది. అయితే, సంబంధిత పోలీసులు దర్యాప్తు కొనసాగించడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. ఆ విషయం గురించి సంహితలో స్పష్టత లేదు.

- డా. మంగారి రాజేందర్