- తెలంగాణ, ఏపీ పోలీసులు వెనక్కి
- బోర్డు ఆదేశాలను పట్టించుకోని ఏపీ.. కొనసాగుతున్న నీటి విడుదల
- రాష్ట్ర పోలీసులపై ఏపీలో రెండు కేసులు నమోదు
హాలియా, వెలుగు : నాగార్జున సాగర్ ప్రాజెక్టును సీఆర్పీఎఫ్ తన ఆధీనంలోకి తీసుకుంది. ప్రాజెక్టు నిర్వహణను కేంద్రం చేతిలో పెట్టాలన్న ప్రతిపాదనకు తెలంగాణ, ఏపీ అంగీకరించిన నేపథ్యంలో డ్యామ్ వద్దకు సీఆర్పీఎఫ్ బలగాలు చేరుకున్నాయి. తెల్లవారుజాము నుంచి ఒక్కో పాయింట్‌ను తమ కంట్రోల్‌లోకి
తీచ్చుకున్నాయి. తర్వాత డ్యామ్‌పై కవాతు నిర్వహించాయి. ఈ క్రమంలో తెలంగాణ, ఆంధ్ర పోలీసులు డ్యామ్ వద్ద నుంచి వెనుదిరిగారు. మరోవైపు 13వ గేటు వద్ద ఏపీ పోలీసులు వేసిన ముళ్ల కంచెను ఇంకా తొలగించ లేదు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో శనివారం ఉదయం నిర్వహించాల్సిన సమావేశాన్ని ఈనెల 6కు వాయిదా వేశారు.
డ్యామ్‌ను సందర్శించిన కేఆర్ఎంబీ సభ్యులు
నాగార్జునసాగర్ డ్యామ్‌ను కేఆర్ఎంబీ సభ్యులు అశోక్ కుమార్, రఘునాథ్ శనివారం మధ్యాహ్నం సందర్శించారు. తెలంగాణ వైపు ఉన్న డ్యామ్‌ను పరిశీలించారు. తర్వాత ఆంధ్ర వైపు వెళ్లి అక్కడి అధికారులతో చర్చలు జరిపారు. సెంట్రల్ వాటర్ కమిషన్ అసిస్టెంట్ డైరెక్టర్ వీఎన్ రావు.. డ్యామ్ పరిసర ప్రాంతాలను సందర్శించి రెండు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ అధికారులకు కీలక సూచనలు చేశారు. 6వ తేదీ వరకు స్టేటస్ కో పాటించాలని ఏపీ అధికారులకు ఆయన చెప్పారు.
రాష్ట్ర పోలీసులపై రెండు కేసులు
గుంటూరు జిల్లా విజయపురి సౌత్ పీఎస్‌లో తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసులపై శనివారం రెండు కేసులు నమోదయ్యాయి. సాగర్ డ్యామ్‌పై తమ విధులను అడ్డుకున్నారంటూ ఏపీ ఇరిగేషన్ అధికారులు కంప్లైంట్ చేశారు. దీంతో సెక్షన్ 407, 341, రెడ్ విత్ 34 ఐపీసీసెక్షన్ల కింద తెలంగాణ పోలీసులపై కేసులు నమోదు చేశారు. తెలంగాణ ఇరిగేషన్ అధికారులు, డ్యాం ఎస్పీఎఫ్ సిబ్బంది ఫిర్యాదుతో నాగార్జున సాగర్ పోలీస్ స్టేషన్లో ఏపీ అధికారులు, పోలీసులపై శుక్రవారం పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
కుడి కాల్వ నుంచి 5,450 క్యూసెక్కుల విడుదల
నాగార్జునసాగర్ కుడి కాల్వ ద్వారా ప్రస్తుతం 5,450 క్యూసెక్కుల నీరు విడుదల అవుతున్నది. నీటి విడుదలను నిలిపి వేయాలంటూ శుక్రవారం కృష్ణా రివర్ బోర్డు ఇచ్చిన ఆదేశాలను ఏపీ పట్టించుకోలేదు. శనివారం రాత్రి వరకు కూడా నీటి విడుదలను కొనసాగించింది. మరోవైపు ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంచాయితీపై కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబాశ్రీ ముఖర్జీ నేతృత్వంలో శనివారం వీడియో కాన్ఫరెన్స్ జరిపింది.
తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్స్ తదితరులు హాజరయ్యారు. గంటన్నర పాటు కొనసాగిన ఈ సమావేశం నిర్ణయాలను త్వరలోనే విడుదల చేస్తామని సీడబ్ల్యూసీ చైర్మన్ కుష్వీందర్ వోహ్రా తెలిపారు.