మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలి..తూప్రాన్ హాస్పిటల్ వద్ద సీఆర్పీల ఆందోళన

మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలి..తూప్రాన్ హాస్పిటల్ వద్ద సీఆర్పీల ఆందోళన
  • అరెస్ట్ చేసి పీఎస్ తరలించిన పోలీసులు 

తూప్రాన్, వెలుగు: మెదక్ జిల్లా చేగుంట మండలంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీఆర్పీల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ తూప్రాన్ లో శనివారం ఆ సంఘం రాష్ట్ర నాయకులు ఆందోళనకు దిగారు. మృతి చెందిన శ్రీనివాస్, రమేశ్ ఫ్లెక్సీలతో హాస్పిటల్  వద్ద  నిరసన వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో  మృతి చెందిన రెండు కుటుంబాలకు రూ.30 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన యూనియన్ నాయకులు జిల్లాలోని సీఆర్పీలు కదిలిరావడంతో హాస్పిటల్  వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న డీఎస్పీ వెంకటరెడ్డి వారికి ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో అరెస్టు చేసి పీఎస్​లకు తరలించారు. అనంతరం రెండు డెడ్​బాడీలను పోలీస్ బందోబస్తు మధ్య వారి స్వస్థలాలకు తరలించారు.

న్యాయం కోసం పోరాటం చేస్తున్న సీఆర్పీ నాయకులను పోలీసులు అక్రమ అరెస్టు చేయడం సరికాదని ఆ  సంఘం రాష్ట్ర నాయకులు ఖండించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబాలకు న్యాయం చేసేలా చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో సమగ్ర శిక్ష ఉద్యోగులు ఈ రోజు విధులు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. 

ఆటో డ్రైవర్​ఇంటి ముందు డెడ్​బాడీతో ఆందోళన

చేగుంట: తూప్రాన్​ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్​మార్టం అనంతరం డెడ్​బాడీలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా చందాయిపేటకు చెందిన ఎర్ర శ్రీనివాస్​  కుటుంబ సభ్యులు, బంధువులు అతడి డెడ్ బాడీని చిన్న శివనూర్​కు తీసుకెళ్లి ఆటో డ్రైవర్​ఇంటి ముందు ఉంచి ఆందోళన చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు. పోలీసులు చట్టప్రకారం న్యాయం జరిగేలా చూస్తామని నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.