న్యూఢిల్లీ: దేశంలోని ప్రార్థనా స్థలాల విచారణలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రార్థనా స్థలాల దర్యాప్తును నాలుగు వారాల పాటు ఆపేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం దిగువ కోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, 1991 ప్రార్థనా స్థలాల చట్టంలోని కొన్ని నిబంధనలను సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లపై గురువారం (డిసెంబర్ 12) ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, జస్టిస్ కెవి విశ్వనాథన్, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ప్రత్యేక బెంచ్ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.
1991 ప్రార్థనా స్థలాల చట్టంలోని కొన్ని నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ ప్రారంభించినందున.. దేశంలోని మసీదులతో సహా ప్రార్థనా స్థలాలపై కొనసాగుతున్న సర్వేలను నిలిపివేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అలాగే, దేశంలోని వివిధ కోర్టుల్లో ప్రార్థనా స్థలాల వివాదాలకు సంబంధించిన పిటిషన్లపై జరుగుతోన్న విచారణలను కూడా ఆపేయాలని దిగువ కోర్టులను సుప్రీం ఆదేశించింది. దీంతో పాటుగా విచారణ పూర్తి అయిన పిటిషన్లపై తుది తీర్పును వెలువరించవద్దని సూచించింది.
ALSO READ | ఇప్పటికైనా కేంద్రం స్పందించాలె: బంగ్లాదేశ్ హిందువులపై దాడుల విషయంలో మమత కామెంట్
తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ ఉత్తర్వుల్లో అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. ప్రార్థనా స్థలాల అంశంపై రిప్లై ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నాలుగు వారాల సమయం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం తన స్పందనను తెలిపే వరకు ఈ అంశంపై నిర్ణయం తీసుకోలేమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. కాగా, ఇటీవల దేశంలో ప్రార్థనా స్థలాల వివాదాలు పెరిగిపోతున్నాయి. జ్ఞానవాపీ మసీదు, షాహీ ఈద్గా, సంభాల్ మసీదు వ్యవహారం దేశంలో ఎంత దూమారం రేపింది తెలిసిందే.
ఈ మసీదుల కింద గతంలో హిందు దేవాలయాలు ఉన్నాయని.. తిరిగి అక్కడ ఆలయాలు నిర్మించాలని కోరుతూ పలువురు హిందువులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన కోర్టులు.. మసీదుల్లో సర్వే చేయాలని ఆదేశించాయి. మసీదుల దగ్గర సర్వే సమయంలో పలు చోట్ల మత ఘర్షణలు చెలరేగాయి. సంభాల్ మసీదు వద్ద అధికారులు సర్వేకు వెళ్లగా అక్కడ అల్లర్లు జరిగి ప్రాణ నష్టం చోటు చేసుకుంది. దీంతో 1991 ప్రార్థనా స్థలాల చట్టాలకు విరుద్ధంగా దిగువ కోర్టులు ఆదేశాలు ఇచ్చాయని పలువురు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు పై ఆదేశాలను జారీ చేసింది.