బాలికపై అత్యాచారం కేసు: ముచ్చుమర్రి వాసి అనుమానాస్పద మృతి 

నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో 8ఏళ్ళ బాలికపై అత్యాచారం ఏపీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఘటన జరిగి రెండువారాలు కావస్తున్నా బాలిక మృతదేహం లభించకపోవటం మిస్టరీగా మారింది. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న వ్యక్తి  మరణించడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గుర్లకు సహకరించారన్న అనుమానంతో పోలీసులు హుస్సేన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు.

హుస్సేన్ శరీరంపై గాయాలు ఉండటం అనుమానాస్పదంగా మారింది. ఇది హత్యా, ఆత్మహత్యా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హుస్సేన్ ముగ్గురు మైనర్ నిందితుల్లో ఒకరికి మేనమామ అని సమాచారం. మిస్టరీగా మారిన ఈ కేసులో హుస్సేన్ మరణం మరో కీలక మలుపుగా మారింది. విచారణ సమయంలో పోలీసులే కొట్టి చంపారని బంధువులు ఆరోపిస్తున్నారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హుస్సేన్ ను ఎవరైనా కొట్టి చంపారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.