- మూడేండ్లు కూడా నిలబడలే!
- సిరిసిల్లలో శిథిలమవుతున్న ఫుట్ పాత్ టైల్స్
- రూ.50 కోట్లతో పనులు పూర్తి
- అధికారులపై పట్టణ ప్రజల ఆగ్రహం
రాజన్న సిరిసిల్ల, వెలుగు: స్థానిక పురకపాలక సంఘం ఆధ్వర్యంలో ఫుట్ పాత్కోసం వేసిన టైల్స్ మూడేండ్లు గడవక ముందే ధ్వంసమయ్యాయి. సుమారు రూ.50 కోట్ల నిధులతో చేపట్టిన పనుల్లో నాణ్యత లేకపోవడంతో ప్రజలు అధికారులు, లీడర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2018–19లో సిరిసిల్ల పట్టణంలోని కరీంనగర్, కామారెడ్డి రోడ్ లో కలెక్టరేట్ నుంచి కార్గిల్ లేఖ్ వరకు, సిరిసిల్ల, సిద్దిపేట రోడ్ లో అంబేద్కర్ కూడలి నుంచి మానేరు వంతెన దాకా మూడు వైపులా 15 కిలోమీటర్లు మేర విస్తరణ పనులు చేపట్టారు. ఇందులోభాగంగా అంబేద్కర్ కూడలి నుంచి 80 ఫీట్లు, కరీంనగర్, కామారెడ్డి రోడ్ ను 100 ఫీట్ల వెడల్పుతో విస్తరించారు. పాదచారులు నడవడం కోసం రోడ్ కు ఇరువైపుల అయిదడుగుల వెడుల్పుతో టైల్స్ నిర్మించాలి. కానీ రోడ్ విస్తరణపై దృష్టి సారించిన ఆఫీసర్లు మురుగు కాలువ, ఫుట్‌పాత్‌ను విస్మరించారు.
మూడు ఫీట్లతోనే..
రోడ్డుకు ఇరువైపులా ఏడు ఫీట్లతో నిర్మించాల్సిన టైల్స్ ను కేవలం మూడు ఫీట్ల వెడల్పుతో నిర్మించడంతో మురుగు కాలువపై నిర్మించిన టైల్స్ శిథిలమవుతున్నాయి. కొన్నిచోట్ల పూర్తిగా ధ్వంసమయ్యాయి. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో నేతన్న చౌక్, పాత బస్టాండ్, కరీంనగర్ రోడ్, కొత్త చెరువు, సంజీవయ్యనగర్ లలో కొద్దిపాటి వర్షానికే మురుగు కాల్వలు నిండి ఫుట్ పాత్ లపై ప్రవహిస్తుండటంతో ఫుట్ పాత్ లు పాడవుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చర్యలు తీసుకుంటాం
పట్టణంలో రోడ్ ఇరువైపులా ఉన్న ఫుట్ పాత్ లకు సంబంధించి దెబతిన్న మరమ్మతులు చేపడతాం. ఇప్పటికే రిపేర్ చేయడానికి ప్లానింగ్ సిద్ధం చేశాం. దీని కోసం జనరల్ ఫండ్ నుంచి నిధులు కేటాయిస్తాం. వరదల సమయంలో మురుగు నీరు కాల్వలలో పేరుకు పోయిన ఇసుకను, మట్టిని తొలగిస్తున్నాం. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడతాం.
- సమ్మయ్య, మున్సిపల్ కమిషనర్