క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి? అసలు ఇది సేఫేనా?

డిజిటల్ కమ్యూనికేషన్, డిజిటల్ బిజినెస్, డిజిటల్ పేమెంట్స్, డిజిటల్ ఎడ్యుకేషన్.. ​ఇలా మనదేశంలో ఇప్పుడన్నీ డిజిటల్ మయం అవుతున్నాయి. 30 ఏళ్ల క్రితం వీటి అవసరాన్ని, రాకను ఎవరూ ఊహించలేదు. డిజిటల్ కరెన్సీ కూడా అంతే. భవిష్యత్ లో డిజిటల్ కరెన్సీలకు డిమాండ్ పెరగవచ్చు. ఇండియా, చైనా వంటి దేశాలు దీన్ని వ్యతిరేకిస్తున్నా, అమెరికా సహా చాలా దేశాలు దీనికి అనుకూలమైన పథకాలను రూపొందిస్తున్నాయి. సెంట్రల్ అమెరికాలోని ఎల్ సాల్వడార్ కాంగ్రెస్ 20 జూన్ 2021 న బిట్‌‌కాయిన్ చట్టాన్ని ఆమోదించింది. అనేక దక్షిణ అమెరికా, ఆఫ్రికన్ దేశాలు కూడా బిట్‌‌కాయిన్‌‌కు చట్టపరమైన హోదాపై ఆలోచిస్తున్నాయి.  క్రిప్టో కరెన్సీ చలామణిని ఇండియా ఇప్పుడప్పుడే అంగీకరించకపోయినా.. డిజిటల్​ రూపీని తీసుకొచ్చేందుకు ఆర్బీఐ ప్రయత్నాలు చేస్తోంది.  

ద్రవ్య మార్పిడిలో అంతర్జాతీయంగా ఎన్నో మార్పులొస్తున్నాయి. పూర్వం వస్తుమార్పిడి పద్ధతిలో వస్తు వినిమయం జరిగేది. కాలానుగుణంగా గోల్డ్, సిల్వర్ కాయిన్స్ వచ్చాయి.  ఆ తరువాత టోకెన్ కాయిన్స్, ఫుల్లీ బోడిఎడ్ కాయిన్స్ వంటి వాటిని నగదు రూపంలో వాడేవారు. మొదటిసారిగా అమెరికా ‘కాయిన్ ఏజ్ యాక్ట్1792’  ద్వారా పేపర్ రూపంలో ‘డాలర్’ ను ద్రవ్య యూనిట్ గా ప్రవేశపెట్టింది. తర్వాత ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా దేశీయంగా చెల్లుబాటు అయ్యేలా నిర్ధిష్ట పేపర్ కరెన్సీని చలామణిలోకి తెచ్చాయి. కాలానుగుణంగా దేశీయ, అంతర్జాతీయ కరెన్సీల్లో ఎన్నో మార్పులొస్తున్నాయి. అలా కొత్త టెక్నాలజీతో రూపుదిద్దుకున్నదే క్రిప్టో కరెన్సీ. 

క్రిప్టో కరెన్సీ అంటే..
క్రిప్టో కరెన్సీ అనేది ఒక డిజిటల్ కరెన్సీ. ‘పేటీఎం’, ‘గూగుల్ పే’ లాగానే ఇది కూడా ఓ వాలెట్. దీన్ని ‘క్రిప్టోగ్రఫీ కరెన్సీ’, ‘ఎన్క్రిప్షన్ కరెన్సీ’ అని కూడా పిలుస్తారు. ఈ వర్చువల్ కరెన్సీ క్రిప్టోగ్రఫీ సూత్రంపై పనిచేసే బ్లాక్‌‌చైన్ టెక్నాలజీ నుంచి తయారు చేసింది. ఇది ఏ దేశానికీ చెందినది కాదు. క్రిప్టోకరెన్సీలపై ఎవరి నియంత్రణా ఉండదు. ఇది పూర్తిగా వికేంద్రీకృత వ్యవస్థ. దీన్ని హ్యాక్ చేయలేరు.. ఇది దెబ్బతినదు. సూటిగా చెప్పాలంటే లేని వస్తువు మీద రూపాయలు పెట్టుబడి పెట్టడం లాంటిది. అక్కడ పెట్టిన రూపాయలే ఫిజికల్​గా కనిపిస్తాయి కానీ క్రిప్టో కరెన్సీ మాత్రం కనబడదు. ఏప్రిల్ 2021 నాటికి ప్రపంచంలో సుమారు10,000కి పై గా వివిధ రకాల క్రిప్టోకరెన్సీలు ఉన్నాయి. వాటిలో కొన్ని కాయిన్స్ కాగా మరికొన్ని టోకెన్లు. ‘బిట్‌‌కాయిన్, ఆల్ట్‌‌కాయిన్లు’ వంటివి కాయిన్స్ కిందకు వస్తాయి. వివిధ రకాల క్రిప్టో కరెన్సీలు ఉన్నప్పటికీ వాటిల్లో ‘బిట్‌‌కాయిన్’ ప్రముఖమైనది.

క్రిప్టో కరెన్సీ పుట్టుక
క్రిప్టో కరెన్సీ రూపంలో మొట్టమొదటి సారిగా ‘స‌‌తోషి న‌‌క‌‌మొటొ’ అనే వ్యక్తి 2008లో ‘బిట్ కాయిన్’ క‌‌రెన్సీని సృష్టించాడు. మొత్తం క్రిప్టో కరెన్సీలో 70 శాతం మార్కెట్ ‘బిట్ కాయిన్’ దే. క్రిప్టో కరెన్సీ మార్కెట్ లో బిట్ కాయిన్ విలువ సుమారు950 బిలియన్ డాలర్లు. ‘స‌‌తోషి న‌‌క‌‌మొటొ’ అనే వ్యక్తి ఎవరు అనేది ఇప్పటికీ తెలియదు. 18 ఆగ‌‌స్టు 2008న ‘బిట్‌‌ కాయిన్ డాట్ ఓఆర్‌‌జీ’ అనే వెబ్‌‌సైట్‌‌ను కూడా అత‌‌నే ప్రారంభించాడు. సతోషి నకమొటొ రూపొందించిన ‘సెక్యూర్ హ్యాష్ అల్గారిథమ్ 256’ ద్వారా బిట్ కాయిన్ ఉద్భవించింది. ఈ అల్గారిథమ్ ద్వారా కేవలం2 కోట్ల10 లక్షల బిట్ కాయిన్లు మాత్రమే రూపొందించవచ్చు. ప్రస్తుతం1 కోటి 80 లక్షల బిట్ కాయిన్ లు చలామణిలో ఉన్నాయి.

క్రిప్టో కరెన్సీ తయారీ
క్రిప్టో కరెన్సీకి చెందిన ‘బిట్ కాయిన్’ ను రెండు పద్ధతుల ద్వారా సంపాదించవచ్చు. మొదటిది బిట్ కాయిన్ ను మైనింగ్ చేయడం. రెండోది వెబ్​సైట్స్ ద్వారా కొనడం. ​మైనింగ్ కింద కొన్ని బ్లాక్స్ సాల్వ్ చేసి బిట్ కాయిన్ ను జనరేట్ చేయాలి. ఇలా ‘ఫజిల్ బ్లాక్’ ని సాల్వ్ చేసి బిట్ కాయిన్ జనరేట్ చేసేవారిని ‘బిట్ మైనర్’ అంటారు. మైనర్లకు ట్రాన్సాక్షన్ ఫీజు, కొన్ని బిట్ కాయిన్స్ రివార్డ్ గా వెళ్తాయి. ఉదాహరణకు ‘A ’ అనే వ్యక్తి ఒక బిట్ కాయిన్ ని ‘B’  కి ట్రాన్స్​ఫర్ చేసినప్పుడు ఆ బిట్ కాయిన్ ద్వారా కొన్ని బ్లాక్ లు ఏర్పడతాయి. ఈ బ్లాక్ లను కొన్ని ‘మ్యాథమెటికల్ హాష్’ ల ద్వారా మైనర్లు సాల్వ్ చేస్తారు. తద్వారా కొత్త బిట్ కాయిన్ జనరేట్ అవుతుంది. ఈ పక్రియ చాలా కష్టతరమైనది. ఇప్పటివరకు సుమారుగా 5 లక్షల బ్లాక్ లను మాత్రమే సాల్వ్ చేసారు. ప్రతి బ్లాక్ సాల్వ్ చేయడం ద్వారా గరిష్టంగా 50 బిట్ కాయిన్స్​వరకు జనరేట్ అవుతాయి. ఇలా ప్రస్తుతం 1.70 కోట్ల బిట్ కాయిన్స్ చలామణిలో ఉన్నాయి. బిట్ కాయిన్ ద్వారా జరిగిన అన్ని వ్యవహారాలు ‘బ్లాక్ చైన్’ అనే ప్రత్యేక సిస్టంలో నమోదవుతాయి. బ్లాక్ చైన్ అనేది ‘అకౌంట్ బుక్’ లాంటిది. బిట్ కాయిన్ లావాదేవీలపై ప్రపంచవ్యాప్తంగా ఒకే రకమైన ట్రాన్సాక్షన్ చార్జీలు(బ్యాంకుల కంటే తక్కువగా) ఉంటాయి. బిట్ కాయిన్ లను సతొషిలతో కొలుస్తారు. 1 బిట్ కాయిన్ లో10 కోట్ల సతొషిలు ఉంటాయి. మార్చి 2010లో ఒక బిట్ కాయిన్ విలువ 0.003 అమెరిక‌‌న్ డాలర్లు కాగా ప్రస్తుతం 34,694.30 డాలర్లు. దీన్ని మొద‌‌టిసారిగా మార్చి 2010లో వాస్తవ క‌‌రెన్సీతో ట్రేడింగ్ చేయ‌‌డం మొద‌‌లు పెట్టారు. తక్కువ కాలంలోనే బిట్ కాయిన్ విలువ అమాంతం పెరిగింది. 2017లో రూ.1,40,000 ఉన్న ఒక్క బిట్ కాయిన్ విలువ 2021 ఏప్రిల్ లో సుమారు రూ. 48 లక్షలకు చేరుకుంది. అన్ని దేశాల కరెన్సీలతో పోలిస్తే బిట్ కాయిన్ విలువ ఎప్పటిక‌‌ప్పుడు పెరుగుతూనే వ‌‌చ్చింది. దీనికి కారణం పెట్టుబడులు పెరగడం, బిట్ కాయిన్ ను లీగల్ నగదుగా గుర్తించే దేశాలు, సంస్థలు క్రమంగా పెరుగుతుండటమే.

పెట్టుబడి పెట్టొచ్చా..
ఇటీవల కాలంలో క్రిప్టో కరెన్సీలపై ఇన్వెస్ట్​ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. మైనింగ్ ద్వారా కేవలం 2.10 కోట్ల బిట్ కాయిన్స్ కు మాత్రమే అవకాశం ఉండటం, అన్ని దేశాల్లో వీటి చలామణి ఎక్కువ కావడంతో డిమాండ్ పెరుగుతోంది. వీటి లావాదేవీల్లో మధ్యవర్తులు ఉండరు. వీటితో జరిగే వ్యవహారాలు అత్యంత పారదర్శకం. కానీ వీటిలో పెట్టుబడి ఎప్పటికీ సురక్షితం కాదు. క్రిప్టో కాయిన్లతో జరిగే వ్యవహారాలు ప్రత్యేక సర్వర్ల లో ఉన్నప్పటికీ వాటి భద్రతకు ఎటువంటి హామీ ఉండదు. ఇది పూర్తిగా డిజిటల్ కావడంతో ఏమైనా సాఫ్ట్ వేర్ సమస్యలు వస్తే వినియోగదారులు నష్టపోతారు. ఒకవిధంగా క్రిప్టో కాయిన్లపై పెట్టుబడి సురక్షితమేమీ కాదు. అందుకే వీటిని 
కొన్ని దేశాలు బ్యాన్ చేశాయి. 

భారత్ లో క్రిప్టో కరెన్సీ
మన దగ్గర 2018లో ఆర్ బీఐ క్రిప్టో కరెన్సీ లావాదేవీలను నిషేధించింది. కానీ 2020లో సుప్రీంకోర్టు ఈ నిషేధాన్ని కొట్టేసి బిట్ కాయిన్ల కొనుగోలు, అమ్మకాలకు అనుమతినిచ్చింది. దీంతో చాలామంది ఇన్వెస్టర్స్ బిట్ కాయిన్లపై పెట్టుబడులు పెడుతున్నారు. ప్రస్తుతం మనదేశంలో బిట్ కాయిన్ లీగల్ బిజినెస్. కానీ ఇక్కడ వీటి నియంత్రణకు ఎలాంటి చర్యలు లేవు. బిట్ కాయిన్ ద్వారా మోసపోయినా.., ఇతర నష్టాలు ఎదురైనా పోలీసులకు, కోర్టులకు ఫిర్యాదు చేసే పరిస్థితి లేదు. బిట్‌‌కాయిన్‌‌ సహా ఇతర వర్చువల్‌‌ కరెన్సీలో ట్రేడింగ్‌‌ చేసే వారు సొంతంగా రిస్క్‌‌ తీసుకోవాలి. నగదుకు బదులుగా  బిట్ కాయిన్లను అంగీకరించే సంస్థలు కూడా మనదేశంలో లేవు. కొన్నేళ్ల క్రితం రిలయన్స్ కంపెనీ కూడా క్రిప్టో కరెన్సీపై ఆసక్తి చూపినా.. తర్వాత వెనక్కి తగ్గింది.

- డాక్టర్ రామకృష్ణ బండారు, కామర్స్ విభాగం, కోఠి ఉమెన్స్ కాలేజ్,  ఓ.యూ