విశ్లేషణ: క్రిప్టో కరెన్సీ  భద్రమేనా?

క్రిప్టో.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తున్న మాట ఇది. క్రిప్టో కరెన్సీ చాలా దేశాల్లో చట్టబద్ధం కాగా, మరికొన్ని దేశాలు దీన్ని నిషేధించాయి. అసలు క్రిప్టో కరెన్సీ వాడకం మంచిదేనా? అసలు దీన్ని నిషేధించాలా? లేదంటే నియంత్రిస్తే సరిపోతుందా? తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే ఏమవుతుంది? డిజిటల్ కరెన్సీయే అయినా పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టాలా.. వద్దా? ప్రస్తుతం చాలా మందిలో మెదులుతున్న ప్రశ్నలివి.

క్రిప్టో కరెన్సీని కొన్ని దేశాలు వ్యతిరేకిస్తున్నా.. చాలా దేశాలు స్వాగతిస్తున్నాయి. జూన్ లో బిట్‌‌‌‌‌‌‌‌కాయిన్ చట్టాన్ని ఆమోదించిన ఎల్​సాల్వెడార్.. క్రిప్టో కరెన్సీతో చట్టపరంగా లావాదేవీలు జరపడానికి టెక్నాలజీ సాయం అందించాలని ప్రపంచ బ్యాంక్‌‌‌‌కు విజ్ఞప్తి చేసింది. అయితే ఇందుకు వరల్డ్ బ్యాంక్ నిరాకరించింది. అనేక దక్షిణ అమెరికా, ఆఫ్రికన్ దేశాలు కూడా బిట్‌‌‌‌‌‌‌‌కాయిన్‌‌‌‌‌‌‌‌కు చట్టపరమైన హోదాపై ఆలోచిస్తున్నాయి. బిట్ కాయిన్ ను లీగల్ గా గుర్తించే దేశాలు, సంస్థల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన ది సిడ్నీ డైలాగ్‌‌‌‌ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోడీ మాట్లాడుతూ ‘క్రిప్టో కరెన్సీపై దేశాలన్నీ కలిసి పనిచేయాలి. అది అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లకుండా చూసుకోవాలి. దీని కోసం అంతర్జాతీయ చట్టం అవసరం’ అని సూచించారు. దీంతో క్రిప్టో కరెన్సీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.  ఇక క్రిప్టో క‌‌‌‌రెన్సీతో చాలా సమస్యలు ఉన్నాయ‌‌‌‌ని, దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం రావచ్చని ఆర్బీఐ గవర్నర్​ శ‌‌‌‌క్తికాంతదాస్ అనుమానం వ్యక్తం చేశారు. 

హెచ్చుతగ్గులు ఎక్కువే
క్రిప్టో కరెన్సీతో జరిగే వ్యవహారాలు ప్రత్యేక సర్వర్లలో ఉన్నప్పటికీ వాటి భద్రతకు ఎలాంటి హామీ ఉండదనే చెప్పవచ్చు. ఇది పూర్తిగా డిజిటల్ కరెన్సీ కావడంతో ఏమైనా సమస్యలొస్తే వినియోగదారులు నష్టపోయే ప్రమాదముంది. బిట్ కాయిన్ల ద్వారా మోసపోయినా, ఇతర నష్టాలు ఎదురైనా పోలీసులకు, కోర్టులకు ఫిర్యాదు చేసే పరిస్థితి ప్రస్తుతం లేదు. అంతేకాక దీని ధర ఎప్పుడు పడిపోతుందో, ఎప్పుడు పెరుగుతుందో చెప్పలేం. ఒకసారి టెస్లా కార్లకు చెల్లింపులు బిట్‌‌‌‌కాయిన్ తో తీసుకోలేమని ఆ కంపెనీ యజమాని ఎలాన్ మస్క్ ప్రకటించడంతో బిట్‌‌‌‌కాయిన్ విలువ రూ.45 లక్షల నుంచి రూ.25 లక్షలకు పడిపోయింది. గతంలో కొంతమంది హ్యాకర్లు పోలీ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ కు చెందిన బ్లాక్ చైన్ సైటులోని లోపాలను కనిపెట్టి ఎథర్ లాంటి కొన్ని వేల డిజిటల్ టోకెన్‌‌‌‌లను దొంగిలించారు. అప్పట్లో ఇలా దొంగిలించిన వాటి విలువ సుమారు రూ.4,445 కోట్లు. అలాగే కాయిన్ చెక్, ఎమ్‌‌‌‌టీ గోక్స్ లాంటి ఎక్స్చేంజీల్లోనూ మోసాలు జరిగాయి. బిట్‌‌‌‌కాయిన్లను సృష్టించడానికి భారీగా విద్యుత్తు అవసరమవగా, చైనాలోని షిన్‌‌‌‌జియాంగ్‌‌‌‌ ప్రావిన్స్ లో కొన్ని నెలల క్రితం విద్యుత్తు ఉత్పత్తి సంస్థల్లో సమస్యలు రావడంతో సరఫరాను నిలిపివేశారు. ఫలితంగా ఒక్కసారిగా బిట్‌‌‌‌కాయిన్‌‌‌‌ విలువ 14 శాతం మేర పడిపోయింది.

కంట్రోల్​ చేయకపోతే ముప్పు
క్రిప్టో కరెన్సీని నియంత్రించడం అంత సులభం కాకపోవడం, ప్రభుత్వాల వద్ద ఇలాంటి వ్యవస్థలు అందుబాటులో లేకపోవడంతో కొన్ని రకాల ప్రమాదాలు పొంచి ఉన్నాయి. క్రిప్టో కరెన్సీని మనీ లాండరింగ్, స్మగ్లింగ్, తీవ్రవాద కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నారనే అనుమానాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా ఆర్థిక లావాదేవీలను సాగనిస్తే నల్లధనాన్ని తెలుపు కింద మార్చే ప్రమాదమూ ఉంది. మూలధనాన్ని సరిహద్దులు కూడా దాటించవచ్చు. డ్రగ్స్, అక్రమ ఆయుధాల క్రయవిక్రయాలకు అడ్డూ అదుపు ఉండదు. ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో సాధారణ మదుపరుల క్రిప్టో పెట్టుబడులకూ భద్రత ఉండకపోవచ్చు. 

నిషేధమా.. నియంత్రణా?
మనదేశంలో క్రిప్టో కరెన్సీపై పూర్తిగా నిషేధంగానీ, స్పష్టమైన రెగ్యులేషన్లుగానీ లేవు. దీనిపై నిర్ణయానికి ప్రభుత్వం ఎప్పటి నుంచో కృషి చేస్తోంది. ఇప్పటికే జయంత్‌‌‌‌ సిన్హా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ క్రిప్టో ఎక్సేంజీలు, బ్లాక్‌‌‌‌ చైన్‌‌‌‌-క్రిప్టో అసెట్స్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ ప్రతినిధులు, పరిశ్రమ వర్గాలు, విద్యావేత్తలతో సమావేశమై చర్చించింది. క్రిప్టో కరెన్సీపై రిజర్వ్​బ్యాంక్, వివిధ శాఖల అధికారులతో ప్రధాని మోడీ కూడా చర్చించారు. 2018లో ఆర్బీఐ క్రిప్టో లావాదేవీలను నిషేధించినా.. 2020లో సుప్రీంకోర్టు దానిని కొట్టేసి బిట్ కాయిన్ల కొనుగోలు, అమ్మకాలకు అనుమతిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో మార్కెట్‌‌‌‌ విలువ లక్ష కోట్ల డాలర్లకు చేరడంతో వాటిని తేలిగ్గా తీసివేయలేం. క్రిప్టోలకు కీలకమైన బ్లాక్‌‌‌‌ చెయిన్‌‌‌‌ టెక్నాలజీతో దేశ ఆర్థిక వ్యవస్థకు కలిగే ప్రయోజనాలను విస్మరించలేం. అందుకే మనదేశంలో క్రిప్టోలను నిషేధించే బదులు నియంత్రణలోకి తెస్తే బాగుంటుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ఇప్పటికే కొందరు క్రిప్టో కరెన్సీపై క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ చెల్లిస్తున్నారు. క్రిప్టో కరెన్సీని పన్ను పరిధిలోకి తీసుకువచ్చి లాభాలపై పన్ను విధించేలా ప్రభుత్వం యోచిస్తోందని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ వెల్లడించడంతో త్వరలో క్రిప్టోకు చట్టబద్ధత లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇన్వెస్ట్​ చేసేవారిలో యువతే ఎక్కువ
ప్రస్తుతం ఒక బిట్‌‌‌‌కాయిన్ విలువ రూ.45 లక్షల పైమాటే. క్రిప్టో కరెన్సీలో బిట్‌‌‌‌కాయిన్ ఒక్కటే కాదు.. ఇథెరియం, టీథర్, కార్డానో, పోల్కాడాట్, రిపల్, డోజ్‌‌‌‌కాయిన్ లాంటివి చలామణిలో ఉన్నాయి. క్రిప్టో ట్రేడింగ్ 24  గంటలూ ఉంటుంది. అన్ని దేశాల్లోని ఇన్వెస్టర్లు ఈ ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌లో పాల్గొంటారు. దీంతో లిక్విడిటీ ఎక్కువగా ఉంటుంది. ఇది యువతను ఎక్కువగా ఆకర్షిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 40 శాతం క్రిప్టో ఇన్వెస్టర్లు 18 నుంచి 34 ఏండ్లలోపు వారే. మరో 20 శాతం మంది 35 నుంచి 44 ఏండ్ల వయసు వారున్నట్టు ఫైండర్స్‌‌‌‌ క్రిప్టో కరెన్సీ నివేదికలో తేలింది. ఏటా వీటిలో బిలియన్ డాలర్ల లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మన దేశంలో క్రిప్టో ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ల విలువ 6.6 బిలియన్ డాలర్ల(రూ.49,189 కోట్లు)కు చేరుకుంది. ఇది ఇప్పుడు మరింత పెరిగింది. క్రిప్టోల వైపు మరింత మందిని ఆకర్షించడానికి వజీర్ఎక్స్‌‌‌‌‌‌‌‌, కాయిన్‌‌‌‌‌‌‌‌స్విచ్ కుబేర్ వంటి ఎక్స్చేంజీలు ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రకటనలను చూస్తున్న చాలా మంది అవగాహన లేకుండా పెట్టుబడి పెట్టి నష్టపోతున్నారు.

పర్యావరణానికి నష్టమే
క్రిప్టో కరెన్సీలో రకరకాల కాయిన్లు, టోకెన్లు ఉన్నా 70 శాతం మార్కెట్ బిట్ కాయిన్ దే. ఆ తర్వాత ఎథేరియం ఉంటుంది. బిట్ కాయిన్, ఎథేరియంలను మైనింగ్ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేస్తారు. అంటే ‘ఏ’ అనే వ్యక్తి ఒక బిట్ కాయిన్ ను ‘బి’ కి ట్రాన్స్​ఫర్​ చేసినప్పుడు ఆ బిట్ కాయిన్ ద్వారా కొన్ని బ్లాక్ లు ఏర్పడతాయి. ఈ బ్లాక్ లను కొన్ని మ్యాథమెటికల్ హాష్ ల ద్వారా మైనర్లు సాల్వ్ చేస్తారు. తద్వారా కొత్త బిట్ కాయిన్ జనరేట్ అవుతుంది. దీనికోసం శక్తిమంతమైన కంప్యూటర్లు, అత్యధిక సామర్థ్యం గల ప్రాసెసర్లతో కూడిన సర్వర్లు అవసరమవుతాయి. బిట్‌‌‌‌కాయిన్‌‌‌‌ మైనింగ్‌‌‌‌ కోసం వాడే కంప్యూటర్ల సగటు జీవితకాలం సుమారుగా 1.3 సంవత్సరాలు ఉంటుంది. మైనింగ్‌‌‌‌కు వాడిన తర్వాత ఆ కంప్యూటర్లు పనికి రాకుండాపోవడంతో, ఈ ప్రక్రియలో చాలా ఈ-వేస్ట్​ జనరేట్​ అవుతుంది. అంతేకాక క్రిప్టోల సృష్టికి అపారంగా కరెంట్​ అవసరం. ఇవన్నింటి వల్లా క్రిప్టోతో పర్యావరణానికి నష్టం వాటిల్లుతోంది. - మహమ్మద్ ఆరిఫ్, సీనియర్ జర్నలిస్ట్