భూదాన్‌‌ భూములపై నివేదికకు 4 వారాలు గడువివ్వండి

భూదాన్‌‌ భూములపై నివేదికకు 4 వారాలు గడువివ్వండి

    హైకోర్టులో సీఎస్‌‌ అఫిడవిట్‌‌

హైదరాబాద్, వెలుగు: భూదాన్‌‌ భూములకు సంబంధించి నివేదిక సమర్పించడానికి 4 వారాలు గడువు కావాలని చీఫ్‌‌ సెక్రటరీ శాంతి కుమారి హైకోర్టుకు అఫిడవిట్‌‌ దాఖలు చేశారు. భూదాన్‌‌ బోర్డు కాంపెంట్‌‌ అథారిటీ, రెవెన్యూ శాఖ ము ఖ్యకార్యదర్శి భూదాన్ భూముల వ్యవహారంలో వివాదం ఉన్నవారందరికీ నోటీసులు జారీ చేశారని, దీనిపై ఈ నెల 15న విచారణ ఉందని పేర్కొన్నారు. ఈ విచారణ పూర్తయిన తరువాత సమగ్ర నివేదక సమర్పిస్తామని, ఇందుకు గడువు కావాలని కోరారు. 

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో సర్వే నెం.182లో 10.29 ఎకరాలకు ఖాదర్‌‌ ఉన్నీసా బేగంకు వారసత్వ ధ్రువీకరణ పత్రం జారీ చేయడంపై అప్పటి కలెక్టర్‌‌ అమోయ్‌‌ కుమార్, డీఆర్‌‌ఓ ఆర్‌‌పీ జ్యోతిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి గత ఏడాది అందిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ నవాబ్‌‌ ఫరూఖ్‌‌ అలీఖాన్‌‌ పిటిషన్‌‌ దాఖలు చేశారు. 

దీనిని విచారించిన జస్టిస్‌‌ సీవీ భాస్కర్‌‌ రెడ్డి భూదాన్‌‌ భూములపై నివేదిక సమర్పించాలని.. లేకపోతే వ్యక్తిగతంగా హాజరుకావాలని గత నెల 27న ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు నివేదిక సమర్పించడానికి 4 వారాల గడువు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరారు. దీనికి అనుమతించిన న్యాయమూర్తి.. తదుపరి విచారణను మార్చి 10వ తేదీకి వాయిదా వేశారు.