- సీఎస్ పాయింట్ నిర్వాహకుడు ఫ్రాడ్
- నిజామాబాద్ జిల్లా కోటగిరిలో ఘటన
కోటగిరి, వెలుగు: ఎస్‌బీఐ కస్టమర్ సర్వీస్ పాయింట్(సీఎస్‌పీ) నిర్వాహకుడు వినియోగదారులను మోసగించిన ఘటన ఆలస్యంగా తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా కోటగిరి ఎస్‌బీఐ సీఎస్‌పీ నిర్వాహకుడు తన వద్దకు వచ్చే కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని వారి అకౌంట్లలోని డబ్బులు కాజేసేవాడు. ఇది చాలా రోజులుగా జరుగుతుంది. కాగా.. బాధితులు మరో సీఎస్‌పీ సెంటర్ కు వెళ్లి తమ అకౌంట్లను చెక్ చేసుకోగా బ్యాలెన్స్ లేదని తేలింది. వెంటనే బ్యాంకుకు వెళ్లి అకౌంట్లను పరిశీలించగా డబ్బు డ్రా చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో మోసానికి పాల్పడిన సీఎస్‌పీకి బ్యాంకు అధికారులు ఇటీవల లాక్ వేసి సీఎస్‌పీ నిర్వాహకుడితో మాట్లాడారు.
తప్పు ఒప్పుకొని కస్టమర్లకు డబ్బుచెల్లిస్తామని సీఎస్‌పీ నిర్వాహకుడు చెప్పారు. అదే రోజు అతడి తల్లిదండ్రులు రూ.70 వేలు ఇచ్చి, మిగతా డబ్బు వారంలో చెల్లిస్తామని ఒప్పుకున్నారు. పదిహేను రోజులైనా డబ్బులు చెల్లించకపోవడంతో ఆగ్రహించిన బాధితులు సోమవారం ఎస్‌బీఐకు చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో సీఎస్‌పీ నిర్వాహకుడిని బ్యాంకుకు పిలిపించగా సోమవారం రూ. లక్ష జమ చేశారు. మిగతా రూ.3 లక్షలు పొలం అమ్మి వారంలోపు చెల్లిస్తామని బ్యాంకు మేనేజర్, సీఎస్‌పీ స్టేట్ కో – ఆర్డినేటర్ బాబు, స్థానిక నేత తేల్ల రవి సమక్షంలో అంగీకరించారు. మేనేజర్ నచ్చజెప్పడంతో బాధితులు శాంతించి వెనుదిరిగి వెళ్లిపోయారు.