వారంలో రెండు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటిస్త.. అందరినీ కలుపుకొని టీమ్​ వర్క్​తో పనిచేస్త: కొత్త సీఎస్​ రామకృష్ణారావు

వారంలో రెండు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటిస్త.. అందరినీ కలుపుకొని టీమ్​ వర్క్​తో పనిచేస్త: కొత్త సీఎస్​ రామకృష్ణారావు
  • రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషిచేస్త
  • ప్రభుత్వ స్కీమ్స్​ను ప్రజల్లోకి తీసుకెళ్లేలా చూస్త
  • ‘వెలుగు’ ఇంటర్వ్యూలో వెల్లడించిన కొత్త సీఎస్​

హైదరాబాద్​, వెలుగు:  సీఎస్​గా బాధ్యతలు తీసుకున్న తర్వాత వారంలో రెండు రోజులపాటు క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు సీనియర్​ ఐఏఎస్​​ రామకృష్ణరావు తెలిపారు.  ఫైనాన్స్ స్పెషల్ సీఎస్‌‌‌‌‌‌‌‌గా సుదీర్ఘ అనుభవంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితితోపాటు ప్రభుత్వ పథకాలపై అవగాహన ఉన్నందున.. టీం వర్క్​తో సమర్థవంతంగా అడ్మినిస్ట్రేషన్​ చేస్తానని తెలిపారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలతోపాటు ఇతర అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని, వీటిని సక్రమంగా ప్రజలకు అందేలా చేస్తే అదే పెద్ద సక్సెస్​ అని పేర్కొన్నారు. సోమవారం కొత్త సీఎస్​గా అపాయింట్​ అయిన కె.రామకృష్ణారావు 'వెలుగు'కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ  సందర్భంగా తన ప్రణాళికలు, లక్ష్యాలు,  రాష్ట్ర అభివృద్ధిపై మాట్లాడారు.

సీఎం వేగాన్ని అందుకునేలా పనిచేయాలి 

సీఎం రేవంత్​ రెడ్డి  తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తన ప్రధాన లక్ష్యమని రామకృష్ణారావు తెలిపారు. వారంలో రెండు రోజులు జిల్లాల్లో పర్యటించి, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, పరిష్కార మార్గాలు సూచిస్తానని సీఎంకు చెప్పగానే గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారని చెప్పారు.  ‘‘సీఎం చాలా చురుకైన వ్యక్తి. ఆయన స్ఫూర్తితో నేను కూడా అదే ఉత్సాహంతో, వేగంతో పనిచేయాలని భావిస్తున్నా. ఫైనాన్స్ స్పెషల్ సీఎస్‌‌‌‌‌‌‌‌గా సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం నాకు అన్ని శాఖలపై సమగ్ర అవగాహనను ఇచ్చింది. 

తెలంగాణలోని ప్రజల జీవన విధానం, రాష్ట్ర స్థితిగతులు నాకు బాగా తెలుసు. ఈ అనుభవం ప్రభుత్వ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి, పాలసీలను రూపొందించడానికి ఉపయోగపడుతుంది. ప్రజలకు దగ్గరగా ఉంటూ, వారి అవసరాలకు అనుగుణంగా పాలన సాగించాలన్నది నా లక్ష్యం” అని పేర్కొన్నారు. 

ఆ రెండూ ఒక్కరే చేయాలంటే కష్టం

ప్రస్తుతం తాను ఫైనాన్స్ స్పెషల్ సెక్రెటరీగా ఉన్నానని, రేపు సీఎస్​ గా బాధ్యతలను తీసుకుంటున్నానని రామకృష్ణారావు చెప్పారు. ‘‘కొన్ని రోజుల వరకు ఈ రెండు బాధ్యతలు చూస్తాను. కానీ  ఇదే దీర్ఘకాలికంగా కొనసాగించడం కష్టం. కాబట్టి త్వరలో ఈ బాధ్యతను సమర్థవంతమైన వ్యక్తికి అప్పగించాలని భావిస్తున్నా. ఇది నా పనిభారాన్ని తగ్గించడమే కాక, రెండు రంగాల్లోనూ సమర్థవంతమైన ఫలితాలు రావడానికి ఉపయోగపడుతుంది. జిల్లా కలెక్టర్ల బదిలీలు తప్పనిసరిగా జరుగుతాయి. ఈ విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకుంటాం. 

సరైన వ్యక్తులు సరైన స్థానాల్లో ఉండేలా చూస్తాం” అని అన్నారు.  ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడం తన ప్రధాన లక్ష్యాల్లో ఒకటని రామకృష్ణారావు చెప్పారు. ‘‘ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు, ప్రజలతో సంభాషణల ద్వారా స్కీమ్స్​ లబ్ధిని వారికి వివరిస్తాం. అధికారులతో కలిసి, ఈ పథకాల అమలులో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తా. ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటా. ఇక రాష్ట్ర ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కొన్ని ఆధునిక, వ్యవస్థీకృత ప్రణాళికలు ఉన్నాయి. ఖర్చులను నియంత్రించడం, ఆదాయ వనరులను పెంచడం, సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ ద్వారా ఈ లక్ష్యాన్ని సాధిస్తాం” అని వివరించారు.

టీమ్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌తో ముందుకెళ్తా..

తాను ఎవరితోనూ ఘర్షణలకు వెళ్లనని, అలాంటివాటికి ముందు నుంచే దూరంగా ఉంటానని రామకృష్ణారావు తెలిపారు. ‘‘అందరినీ కలుపుకొని, సమిష్టిగా పనిచేస్తా. అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో కలిసి పనిచేస్తూ, రాష్ట్ర లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తా. బహిరంగ చర్చలు, సమన్వయం ద్వారా మంచి ఫలితాలు సాధ్యమని నా బలమైన నమ్మకం.

నాకున్న సమయం కూడా 4 నెలలే. ఆ తర్వాత పొడిగింపు ఉంటుందా? లేదా? అన్నది అప్పుడే తేలుతుంది. సాధారణంగా ప్రభుత్వం కావాలనుకుంటే మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు పదవీకాలం పొడిగించే అవకాశం ఉంది” అని తెలిపారు.