ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి : సీఎస్ శాంతికుమారి

ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి : సీఎస్ శాంతికుమారి
  • కలెక్టర్లు, ఇంటర్​ బోర్డు అధికారులతో సీఎస్ శాంతికుమారి

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 5 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షల నిర్వహణను పకడ్బందీగా నిర్వహించాలని సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు టీమ్ వర్క్ చేయాలని సూచించారు. శుక్రవారం ఇంటర్మీడియేట్ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్ మాట్లాడుతూ.. ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ కు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయాలని, సెక్యూరిటీ పటిష్టం చేయాలని ఆదేశించారు. క్వశ్చన్ పేపర్లను స్ట్రాంగ్ రూమ్ ల నుంచి తరలించే ముందు బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. 

అన్ని పరీక్ష కేంద్రాల్లో 144 సెక్షన్ ని విధించాలన్నారు. ఎటువంటి ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్లను లోపలికి అనుమతించకుండా తనిఖీలు చేయాలన్నారు. వైద్య శాఖ ద్వారా ఓఆర్ఎస్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 5 నుంచి 25 వరకూ ఇంటర్ పరీక్షలు జరగనున్నాయని, వీటికి 9, 96,971 మంది హాజరు కానున్నారని తెలిపారు. వారికోసం 1,532 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల నిర్వహణకు  1,532 మంది సీఎస్​, మరో 1,532 మంది డీవోలను, 29,992 మంది ఇన్విజిలేటర్లను, 75 మంది ఫ్లయింగ్ స్క్వాడ్స్ ను, 100 మంది సిట్టింగ్ స్క్వాడ్స్ ను ఏర్పాటు చేశామన్నారు. సమీక్షలో ఇంటర్ బోర్డు సీవోఈ జయప్రద బాయీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

ఎల్ఆర్ఎస్​పై సమీక్ష

రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ స్కీమ్ అమలుపై కలెక్టర్లతో సీఎస్ సమీక్షించారు. ఇటీవల జారీచేసిన జీవో131 ద్వారా అధికారిక ప్లాట్ల క్రమబద్ధీకరణకు మూడు మార్పులు చేసినట్టు చెప్పారు. మార్చి నెలాఖరులోగా రెగ్యులరైజ్ ​చేసుకునే వారికి రిబేట్ ఇస్తున్నామని వివరించారు.