![కొత్త టూరిజం పాలసీలో వారసత్వ కట్టడాలను చేర్చండి : సీఎస్ శాంతి కుమారి](https://static.v6velugu.com/uploads/2025/02/cs-shanthi-kumari-orders-officials-to-include-heritage-structures-in-new-tourism-policy_VQuSnR3HI6.jpg)
- అధికారులకు సీఎస్ ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి సంబంధించిన ప్రదేశాలను, వారసత్వ కట్టడాలను గుర్తించి కొత్త టూరిజం పాలసీలో పొందుపరచాలని అధికారులను సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న నూతన టూరిజం పాలసీ -2025 పై సీఎస్ శాంతి కుమారి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం డాక్టర్ అంబేద్కర్ సచివాలయంలో సోమవారం జరిగింది. రాష్ట్రంలో ఎకో, టెంపుల్, హెల్త్ టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధి చేసి తద్వారా పర్యాటకుల సంఖ్యను భారీ ఎత్తున ఆకర్షించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆమె అధికారులకు సూచించారు.
ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని పలు చారిత్రక కట్టడాల సందర్శనకు వచ్చే పర్యాటకుల కోసం ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు పరిసర ప్రాంతాలను సందర్శించేందుకు స్కై వాక్ లాంటి ప్రాజెక్టును చేపట్టాలని సీఎస్ సూచించారు. ఇతర రాష్ట్రాలలో అమలులో ఉన్న వివిధ టూరిజం పాలసీలను అధ్యయనం చేసి రాష్ట్రానికి సరిపడ నూతన టూరిజం పాలసీ-2025 ను యువజన, పర్యాటక శాఖ అధికారులు సిద్ధం చేయాలని సీఎస్ పేర్కొన్నారు.
సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల) కె.శ్రీనివాసరాజు, స్పెషల్ సీఎస్ లు రామకృష్ణారావు, పరిశ్రమలు, జయేశ్ రంజన్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్ ఇతర అధికారులు పాల్గొన్నారు.