- ఎగ్జామ్స్ నిర్వహణ, ధాన్యం, పత్తి కొనుగోళ్లపై సీఎస్ సమీక్ష
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్ 3 పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని సీఎస్ శాంతికుమారి తెలిపారు. పరీక్షల నిర్వహణ, వరి, పత్తి కొనుగోళ్లలో పురోగతి, కొత్త నర్సింగ్, పారా మెడికల్ కాలేజీల ప్రారంభం, సామాజిక ఆర్థిక సర్వే తదితర ప్రధాన అంశాలపై బుధవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్3 పరీక్షల నిర్వహణకు 1,401 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఎగ్జామ్స్‌కు దాదాపు 5.36 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు.
పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్సీ విస్తృత ఏర్పాట్లు చేసిందని చెప్పారు. గ్రూప్-3 పరీక్షలను సజావుగా నిర్వహించేలా చూడాలని కలెక్టర్లను ఆమె ఆదేశించారు. అన్ని పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలు స్వయంగా పర్యవేక్షించి, సౌకర్యాలు ఉండేలా చూడాలన్నారు. ఫూల్ ప్రూఫ్ పద్ధతిలో పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. మరోవైపు, ధాన్యం కొనుగోళ్లను కలెక్టర్లు ప్రతిరోజూ పరిశీలించాలని చెప్పారు.
ప్రత్యేక అధికారులు తమ జిల్లాల్లో ధాన్యం తరలింపును పర్యవేక్షించాలని, సిబ్బందికి అవసరమైన సహాయాన్ని అందించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. కొత్తగా మంజూరైన నర్సింగ్, పారామెడికల్ కాలేజీల్లో మరమ్మత్తు పనులను కూడా గడువులోగా పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు.
కులాల సర్వే సజావుగా జరిగినందుకు కలెక్టర్లను ఆమె అభినందించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ జితేందర్, ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పౌరసరఫరాల కమిషనర్ డీఎస్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.