ఉపరాష్ట్రపతి పర్యటన విజయవంతం చేయాలి

ఉపరాష్ట్రపతి పర్యటన విజయవంతం చేయాలి
  • మెదక్ కలెక్టర్​, ఎస్పీని వీడియో కాన్ఫరెన్స్​లో ఆదేశించిన సీఎస్​ శాంతికుమారి 
  • కృషి విజ్ఞాన కేంద్రం వద్ద పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు   కలెక్టర్​ రాహుల్​రాజ్​,  ఎస్పీ ఉదయ్​ కుమార్​ రెడ్డి వెల్లడి 

మెదక్​ టౌన్​, వెలుగు : అధికారులు సమన్వయంతో ఉపరాష్ట్రపతి పర్యటన విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా తమ విధులు నిర్వర్తించాలని తెలంగాణ రాష్ట్ర సీఎస్​శాంతికుమారి కలెక్టర్​ రాహుల్​ రాజ్, ఎస్పీ ఉదయ్​ కుమార్​ రెడ్డిలను ఆదేశించారు. ఈ మేరకు శనివారం సీఎస్​ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్​లో అధికారులతో మాట్లాడుతూ... ఈనెల 25న  కౌడిపల్లి మండలం తునికి లోని  కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగే కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హాజరుకానున్నారని చెప్పారు.

ఈ  పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆఫీసర్లు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా మెదక్​ కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి పర్యటన మధ్యాహ్నం 2.15 నుంచి సాయంత్రం4.15 వరకు రెండు గంటల  పాటు జిల్లాలో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి పోలీస్​, వైద్య, ఆర్​ అండ్​ బీ, ఇతర శాఖలు సమన్వయంతో విధులు నిర్వర్తించేలా అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ చేసి, పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 

కృషి విజ్ఞాన కేంద్రంలో ఉపరాష్ట్రపతి ఆర్గానిక్ వ్యవసాయంపై ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తారని, ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్న రైతులతో నేరుగా మాట్లాడతారన్నారు. అత్యవసర వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతామని కలెక్టర్​ రాహుల్​రాజ్​ సీఎస్​ శాంతి కుమారికి తెలిపారు.  జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..  ఉప రాష్ట్రపతి పర్యటనకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని సీఎస్​కు వివరించారు.  వీడియో కాన్ఫరెన్స్​లో అడిషనల్​ కలెక్టర్​ నగేశ్​,  జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.