- జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 5 నుంచి 9 వరకు నిర్వహించే ‘స్వచ్ఛదనం–పచ్చదనం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న మౌలిక సమస్యలను పరిష్కరించాలని సీఎస్ సూచించారు. ‘స్వచ్ఛదనం– పచ్చదనం’ నిర్వహణపై గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో సెక్రటేరియెట్‌లో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఇంటింటికి మొక్కలు పంపిణీ చేయడంతో పాటు వాటిని పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రతి గ్రామంలో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. పల్లె ప్రకృతి వనాలు, అర్బన్ ఫారెస్ట్ పార్కులు, సంపద వనాల నిర్వహణ సరిగా ఉండేలా చూడాలన్నారు. కాగా.. 5 రోజుల పాటు చేపట్టనున్న కార్యక్రమాలపై కలెక్టర్లకు గైడ్ లైన్స్‌ను జారీ చేశారు.