- అధికారులకు సీఎస్ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుల గణన సర్వేను విజయవంతంగా పూర్తి చేసేందుకు కృషిచేయాలని అధికారులను సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. రాష్ట్రంలో జరుగుతున్న సర్వే నిర్వహణపై గురువారం ప్రత్యేకాధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌లో సీఎస్ సమీక్షించారు. సర్వేకు సంబంధించి స్టిక్కరింగ్ ప్రక్రియ శుక్రవారంతో పూర్తవుతుందని, ఈ నెల 9 నుంచి వివరాల సేకరణ మొదలవుతుందని చెప్పారు.
ఉమ్మడి జిల్లాలకు నియమితులైన ప్రత్యేకాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సర్వే జరుగుతున్న విధానాన్ని పరిశీలించడంతో పాటు జిల్లా కలెక్టర్లు, సర్వే నోడల్ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించాలని సీఎస్ ఆదేశించారు. సేకరించిన వివరాలను కంప్యూటరైజ్ చేసేందుకు అర్హులైన డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించాలని సూచించారు. కుల గణన సర్వేను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. ఈ సర్వేలో ప్రతి కుటుంబం పాల్గొనేలా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు.