రికవరీ నోటీసులు ఇవ్వొద్దు : సీఎస్‌‌ శాంతి కుమారి

రికవరీ నోటీసులు ఇవ్వొద్దు : సీఎస్‌‌ శాంతి కుమారి
  •     అన్ని శాఖలు, కలెక్టర్లకు
  •     ఆదేశాలు జారీ చేసిన సీఎస్ 

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందుకుంటున్న అనర్హులకు సంబంధించి ఎలాంటి నోటీసులు ఇవ్వొద్దని అధికారులకు సీఎస్‌‌ శాంతి కుమారి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పలు వెల్ఫేర్‌‌‌‌ స్కీమ్‌‌లు అనర్హులకు అందుతున్నాయని ప్రభుత్వం గుర్తించిందన్నారు. దీంతో ఈ పథకాలను అర్హులకే మరింత సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో పథకాల అమలు తీరును క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆదివారం ఒక ప్రకటనలో ఆమె వెల్లడించారు.

పథకాల అమలులో అవకతవకలు, అర్హులకే స్కీమ్స్‌‌ అందించేలా రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం చర్చించి తగు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. సంక్షేమ పథకాలు పొందుతున్న అనర్హులను గుర్తించి, రికవరీ చేసే విధానాలపై రాష్ట్ర సర్కార్‌‌‌‌ త్వరలో స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేస్తుందని తెలిపారు. అప్పటివరకు అనర్హులకు రికవరీ నోటీసులు జారీ చేయొద్దని సెక్రటేరియెట్‌‌లోని అన్ని శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలకు, జిల్లా కలెక్టర్లకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.