హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వచ్చే నెల 3న ఎలక్షన్ కమిషన్ అధికారుల పర్యటన ఉన్నందున అధికారులు అన్ని వివరాలతో సిద్ధంగా ఉండాలని సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. ఎన్నికల కమిషన్ అధికారుల రాష్ట్ర పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై శుక్రవారం ఆమె సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన సభ్యులు అక్టోబర్ 3 నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో పర్యటిస్తారని సీఎస్ తెలిపారు. అధికారులు తమ పర్యటనలో ఎన్‌ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు, కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తారని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నందున అన్ని అంశాలపై క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలని ఆమె సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో కల్పించే కనీస సౌకర్యాల వివరాలను అధికారులకు ఇవ్వాలన్నారు. ఏఈఆర్‌వో, ఈఆర్‌వోల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, సమీకృత సరిహద్దు చెక్‌పోస్టుల వివరాలు కూడా ఈసీ అధికారులకు అందుబాటులో ఉంచాలని ఆమె సూచించారు. ఈ సమావేశంలో సీఈవో వికాస్ రాజ్, స్పెషల్ సీఎస్ లు సునీల్ శర్మ, రామకృష్ణారావు, హోం శాఖ ముఖ్యకార్యదర్శి జితేందర్, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఇతర శాఖల కార్యదర్శులు, ఆఫీసర్లు పాల్గొన్నారు.
సీపీలు, ఎస్పీలతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్
రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన నేపథ్యంలో డీజీపీ అంజనీకుమార్ అధికారులను అప్రమత్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీనియర్ పోలీస్ అధికారులు, జిల్లా యూనిట్స్, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈపీ అధికారుల పర్యటనకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అలాగే, స్థానిక పరిస్థితులపై సమీక్ష జరిపారు. అన్ని నియోజకవర్గాలకు చెందిన పూర్తి సమాచారం సేకరించాలని తెలిపారు. అవసరమైతే బందోబస్తు వివరాలు ఎన్నికల సంఘానికి అందించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.