వర్షాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆప్తమత్తంగా ఉండాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. వర్షాలు ఎక్కువగా కురిసే జిల్లాల అధికారులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని చెప్పారు.
విద్యా సంస్థలకు సెలవుల అంశంలో పరిస్థితిని బట్టి ఆయా జిల్లా కలెక్టర్లే నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు సీఎస్ శాంతి కుమారి. డ్యాములు, చెరువులు, కుంటల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్ద వరద ఉద్రితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. జిల్లాలలో పరిస్థితిని ఎప్పటికప్పుడు హైదరాబాద్ హెడ్ క్వార్టర్ కి అప్డేట్ చేయాలని సూచించారు సీఎస్.
ALSO READ | తెలంగాణకు రెడ్ అలర్ట్ : ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
మరో వైపు తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రెండు రోజులపాటు ఈ రెడ్ అలర్ట్ ఉంటుందని స్పష్టం చేసింది. అంటే.. ఆగస్ట్ 31వ తేదీ, సెప్టెంబర్ ఒకటో తేదీన.. శని, ఆదివారాలు.. ఈ రెండు రోజులు అతి భారీ వర్షాలు పడనున్నట్లు హెచ్చరించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో కొన్ని చోట్ల కుండపోత వర్షాలు పడనున్నట్లు స్పష్టం చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ.