రక్షణ శాఖ భూములివ్వండి.. ప్రత్యామ్నాయ భూములు ఇస్తం

  • ఢిల్లీలో కేంద్ర కార్యదర్శులకు రాష్ట్ర సీఎస్ వినతి
  • ఆర్ఆర్ఆర్​ పెండింగ్​ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పలు అభివృద్ధి పథకాలకు సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని సీఎస్​శాంతి కుమారి కోరారు. ఢిల్లీలోని పలువురు కేంద్ర కార్యదర్శులను ఆమె సోమవారం కలసి విజ్ఞప్తి చేశారు. రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్​ను సీఎస్ కోరారు. ప్యారడైస్ జంక్షన్ నుంచి కండ్లకోయ ఓఆర్ఆర్ వరకు, ప్యారడైస్​ నుంచి కరీంనగర్, రామగుండం మార్గంలోని ఓఆర్ఆర్ వరకు నిర్మించ తలపెట్టిన రెండు ఎలివేటెడ్ కారిడార్ల  నిర్మాణానికి, మెహిదీపట్నం జంక్షన్​లో ప్రతిపాదిత స్కై- వాక్ నిర్మాణ పనులకు అవసరమైన మొత్తం 150.39 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని విజ్ఞప్తి చేశారు. 

రక్షణ శాఖ భూములకు సరిపడా ప్రత్యామ్నాయ భూములను ఇస్తామని ఈ సందర్బంగా శాంతికుమారి స్పష్టం చేశారు. ఈ విషయంలో సంబంధిత వివరాలను తెప్పించుకొని త్వరలోనే తగు నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సీఎస్​ శాంతి కుమారితోపాటు, రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ ఉన్నారు. 

వన్యప్రాణి సంరక్షణ బోర్డులో సమస్యలు తీర్చండి

కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ కార్యదర్శి లీలా నందన్ ను కూడా శాంతికుమారి కలిశారు. జాతీయ వన్య ప్రాణి సంరక్షణ బోర్డులో పెండింగ్​లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 60 ప్రతిపాదనలకు ఆమోదం తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు, పీఎం గ్రామ్​ సడక్ యోజన పనులకు సంబంధించి వీలైనంత తొందరగా అటవీ శాఖ అనుమతులు ఇవ్వడానికి నేషనల్ బోర్డు ఫర్ వైల్డ్ లైఫ్ కమిటీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. అలాగే, కేంద్ర రహదారులు, రవాణా, జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్​తోనూ సీఎస్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం పనులకు సంబంధించి పెండింగ్​ సమస్యలను పరిష్కరించాలని కోరారు.