స్కీములు స్పీడప్​.. ఉన్నతాధికారులు, కలెక్టర్లతో సీఎస్ రివ్యూ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ స్కీములను స్పీడప్ చేయాలని సీఎస్​ శాంతికుమారి ఆదేశించారు. ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో సోమవారం సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణాకు హరితహారం, స్వాతంత్ర్య భారత వజ్రోత్సవం సందర్భంగా కోటి మొక్కలు నాటడం, గొర్రెల పంపిణీ, బీసీ, మైనారిటీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం, గృహలక్ష్మి, దళిత బంధు, భూమిపట్టాల పంపిణీ, కారుణ్య నియామకాలు, నోటరీ భూముల క్రమబద్దీకరణ, వీఆర్ వో ల రెగ్యులరైజ్ తదితర అంశాలపై కలెక్టర్లతో సమీక్షించారు. నోటరీ స్థలాల క్రమబద్ధీకరణకు జీవో ఇచ్చామని.. దీనిలో భాగంగా 125 చదరపు అడుగుల విస్తీర్ణంలో భూమిని ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తామన్నారు. 

అంతకు పైగా విస్తీర్ణంలో ఉండే స్థలాలను స్టాంపు డ్యూటీ మొత్తంతోపాటు, చదరపు అడుగుకు రూ.5  అదనంగా చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకోవచ్చని తెలిపారు. ఈ స్కీమ్​పై ప్రజలను చైతన్య పర్చాలని కోరారు. వెంటనే దరఖాస్తులు స్వీకరించాలని కలెక్టర్లను ఆదేశించారు. జీవో 59 కింద నోటీసులు అందుకున్నవారి నుంచి రెగ్యులరైజేషన్​కు నిర్ణయించిన మొత్తాన్ని జమ చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. హరితహారం కింద నాటిన మొక్కలకు జియో ట్యాగింగ్ చేయడంతో పాటు దాదాపు 85 శాతం మొక్కలు మనుగడ సాధించేలా చర్యలు చేపట్టాలన్నారు. వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా కోటి మొక్కలను ఒకేరోజు నాటాలని సీఎం నిర్ణయించారన్నారు. మొక్కలు నాటేందుకు స్థలాల ఎంపిక, కందకం తవ్వకం పూర్తి చేసి ఉంచాలని సూచించారు.

 కోటి మొక్కలు నాటే తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలో వివిధ జిల్లాలో ఉన్న 1,266 మందికి కారుణ్య నియామకాలను రెండు వారాల్లో పూర్తిచేయాలని సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. ఈ నియామకాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ఆఫీస్ సబార్డినేట్ లను జూనియర్ అసిస్టెంట్లుగా అప్-గ్రేడ్ చేస్తూ ఇటీవలే ప్రభుత్వం జీవో 79 విడుదల చేసినందున వెంటనే నియామకాలు పూర్తిచేయాలని స్పష్టం చేశారు.