గ్రూప్1 మెయిన్స్ పకడ్బందీగా నిర్వహించాలి : సీఎ శాంతి కుమారి

గ్రూప్1 మెయిన్స్ పకడ్బందీగా నిర్వహించాలి : సీఎ శాంతి కుమారి
  • గ్రూప్​-1పై కలెక్టర్లకు సీఎ శాంతి కుమారి ఆదేశం
  • పొరపాట్లు జరగకుండాచూడాలని సూచన
  • పరీక్షపై జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లతో సమావేశం

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 21 నుంచి ప్రారంభంకానున్న గ్రూప్1 మెయిన్‌  పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు. గురువారం సచివాలయం నుంచి గ్రూప్ 1 పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్  కమిషనర్లు, సంబంధిత అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించారు. టీజీపీఎస్సీ ఆఫీసు నుంచి కమిషన్  చైర్మన్  మహేందర్ రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు. 

శాంతి కుమారి మాట్లాడుతూ... గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని, వీరికోసం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్  జిల్లాల్లో 46 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. ఆయా సెంటర్ల వద్ద భారీ బందోబస్తు పెట్టామని పేర్కొన్నారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని అధికారులను ఆమె ఆదేశించారు. టీజీపీఎస్సీ చైర్మన్  మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... 2011 తర్వాత గ్రూప్-1 మెయిన్  పరీక్షలు జరుగుతున్నాయన్నారు.

 ఆధునిక సాంకేతికత, సోషల్ మీడియా ఆక్టివ్ గా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ సవాలుతో కూడుకున్నదని, ఈ నేపథ్యంలో ఏవిధమైన అపోహలు, పుకార్లకు తావివ్వకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పరీక్ష జరిగే అన్ని కేంద్రాల వద్ద విస్తృతమైన బందోబస్తు చేపట్టామని డీజీపీ జితేందర్  తెలిపారు. టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్  నికోలస్  మాట్లాడుతూ... హైదరాబాద్​లో 8, రంగారెడ్డి జిల్లాలో 11, మేడ్చల్  మల్కాజిగిరి జిల్లాలో 27  పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. 

ప్రతి పరీక్ష కేంద్రంలోనూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశామని, టీజీపీఎస్సీ ఆఫీసులో ఏర్పాటు చేసిన కంట్రోల్  రూమ్  ద్వారా పరీక్షల తీరును పర్యవేక్షిస్తామన్నారు. మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే 85 శాతం అభ్యర్థులు తమ హాల్ టికెట్లను  డౌన్ లోడ్  చేసుకున్నారని తెలిపారు. వికలాంగులకు ఒక గంట అదనంగా కేటాయిస్తామని  చెప్పారు.