మహిళలను కోటీశ్వరులను చేసేందుకు పాలసీ : సీఎస్ శాంతి కుమారి

మహిళలను కోటీశ్వరులను చేసేందుకు పాలసీ : సీఎస్ శాంతి కుమారి
  • మహిళలందరిని ఎస్​హెచ్​జీలలో చేర్పించాలి: సీఎస్
  • 20.02 కోట్ల మొక్కలు నాటాలని టార్గెట్​
  • ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేయాలి
  • సీజనల్​ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోండి
  • జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ

హైదరాబాద్, వెలుగు: వచ్చే ఐదేండ్లలో రాష్ట్రంలోని 25 వేల గ్రామ సమైఖ్య సంఘాల(ఎస్​హెచ్​జీ)కు కోటి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించే యాక్షన్ ప్లాన్ సమర్థంగా అమలు చేయాలని సీఎస్ శాంతి కుమారి కలెక్టర్లను ఆదేశించారు. అలాగే మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యాన్ని సాధించేందుకు త్వరలోనే ఒక పాలసీ పేపర్​ విడుదల చేస్తామన్నారు.

వనమహోత్సవం, మహిళాశక్తి, ప్రజాపాలన సహాయ కేంద్రాలు, అమ్మ ఆదర్శ స్కూళ్ల పనులు, వ్యవసాయ సంబంధ అంశాలు, ధరణి, ఉద్యోగుల బదిలీలు, గృహనిర్మాణం తదితర అంశాలపై మంగళవారం జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ చేశారు. సీఎం వరంగల్​లో వనమహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారని.. రాష్ట్రంలో ఈ సీజన్ లో 20.02 కోట్ల మొక్కలు నాటాలని టార్గెట్ పెట్టుకున్నామని తెలిపారు.

జిల్లాల వారీగా కేటాయించిన లక్ష్యాల మేరకు నాణ్యమైన మొక్కలను నాటాలన్నారు. నాటిన ప్రతీ మొక్కను జియోట్యాగింగ్ చేయడంతో పాటు వాటి మనుగడకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. గ్రామాల్లో 100 శాతం ఖాళీ స్థలాలు కవర్ అయ్యే విధంగా మొక్కలు నాటాలని సూచించారు. ఎస్​హెచ్​జీలలో ఇప్పటికీ చేరని మహిళలందందరినీ చేర్పించాలని, రానున్న ఐదేండ్లలో స్వయం సహాయక మహిళలను కోటీశ్వరులు చేయాలన్న లక్ష్య సాధనకు త్వరలోనే ఒక విధాన నిర్ణయ పత్రాన్ని విడుదల చేయనున్నట్టు తెలిపారు.

అన్ని జిల్లాల్లో ఇందిరా క్యాంటీన్ ల ఏర్పాటు ను స్పీడప్​ చేయాలన్నారు. అసంపూర్తిగా గా ఉన్న అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను రెండు వారాల్లో పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. వర్షాకాల సీజన్​లో వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ప్రజలను చైతన్య పర్చడంతోపాటు, ఫాగింగ్, యాంటీ లార్వా ఆపరేషన్, ఇంటింటి ఆరోగ్య సర్వే నిర్వహించాలని పేర్కొన్నారు. జిల్లా కేంద్రాలలో 24/7 పనిచేసే హెల్ప్ లైన్లను ఏర్పాటు చేయడంతో పాటు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్​లను ఏర్పాటు చేయాలన్నారు.

ధరణి దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

ధరణిలో ఫిర్యాదుల పరిష్కారానికి మరింత శ్రద్ధ చూపించాలని సీఎస్​ కలెక్టర్లను ఆదేశించారు. రెండున్నరేండ్లుగా 57 వేల దరఖాస్తులకు పైగా జిల్లాల్లో పరిష్కారించారని, పెండింగ్​లో ఉన్న దరఖాస్తులన్నింటినీ పరిష్కరించడానికి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలన్నారు. ధరణి దరఖాస్తుల పరిష్కారంలో మంచి పురోగతి ఉందని ప్రశంసించారు. మిగిలినవి రాబోయే 10 రోజుల్లో పరిష్కరించాలన్నారు.

20లోగా బదిలీలు పూర్తి చేయాలి

ఉద్యోగుల బదిలీల ప్రక్రియను ఈనెల 20 వ తేదీ లోగా ఎట్టిపరిస్థితిలో పూర్తి చేయాలని సీఎస్ స్పష్టం చేశారు. రూల్స్​ప్రకారం బదిలీల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 49 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినందున, ఒక్కో పాఠశాల ఏర్పాటుకు కనీసం 20 ఎకరాల ప్రభుత్వ భూమిని వెంటనే సేకరించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.