
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ డేంజర్ జోన్ లో ఉంది. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ గెలిచి శుభారంభం చేసిన చెన్నై.. ఆ తర్వాత ఆడిన 8 మ్యాచ్ ల్లో 7 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. ప్రస్తుతం 9 మ్యాచ్ ల్లో రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ పై ఆ జట్టు ఫ్యాన్స్ ఇప్పటికీ ఆశలు వదిలేసుకున్నారు. ముంబైతో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ధోనీ కూడా వచ్చే సీజన్ కోసం మంచి జట్టును తయారు చేస్తాం అని చెప్పాడు. ఈ సీజన్ లో చెన్నై ప్లే ఆఫ్స్ కు చేరాలంటే అద్బుతంగా జరగాల్సిందే.
ఒక జట్టు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాలంటే కనీసం 8 మ్యాచ్ ల్లో విజయం తప్పనిసరి. కానీ కొన్ని సందర్భాల్లో 7 మ్యాచ్ లు గెలిచిన జట్లు కూడా ప్లే ఆఫ్స్ కు వెళ్లొచ్చు. గత సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 మ్యాచ్ లు గెలిచి టాప్-4 లో నిలిచింది. ఇతర జట్ల ఫలితాలు కూడా ఆర్సీబీకి కలిసొచ్చింది. ఈ సారి చెన్నై ప్లే ఆఫ్స్ కు చేరాలంటే ఇలాంటి అద్భుతమే జరగాలి. ఈ సీజన్ లో 99 శాతం చెన్నై ప్లే ఆఫ్స్ కు చేరడం అసాధ్యం. అయితే అద్భుతం జరిగితే మాత్రం ధోనీ సేన టాప్-4 లో నిలవొచ్చు.
మిగిలిన 5 మ్యాచ్ ల్లో తప్పకుండా గెలిస్తేనే ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఒక్క మ్యాచ్ ఓడిపోయినా ఇంటి దారి పట్టడం ఖాయం. నెట్ రన్ రేట్ కూడా మైనస్ ల్లో ఉండడం చెన్నైకు మైనస్. దీంతో తర్వాత ఆడబోయే 5 మ్యాచ్ ల్లో భారీగా గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే సమయంలో ఇతర జట్ల ఫలితాలు ధోనీ సేనకు కలిసి రావాలి. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ కనీసం నాలుగు మ్యాచ్ ల్లో ఓడిపోవాలి. మరోవైపు కోల్ కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జయింట్స్ రెండు మ్యాచ్ ల్లో తప్పకుండా ఓడిపోవాలి. సన్ రైజర్స్ ఒక మ్యాచ్ లో ఖచ్చితంగా ఓడాలి. ఇదంతా జరిగితేనే సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది.