CSK: ప్లేఆఫ్స్‌కు ముందు చెన్నైకు బిగ్ షాక్.. టోర్నీ నుండి దీపక్ చాహర్ ఔట్!

CSK: ప్లేఆఫ్స్‌కు ముందు చెన్నైకు బిగ్ షాక్.. టోర్నీ నుండి దీపక్ చాహర్ ఔట్!

ప్లేఆఫ్స్‌కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కి పెద్ద దెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఆ జట్టు స్టార్ పేసర్ దీపక్ చాహర్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లలో పాల్గొనడం సందేహాస్పదంగా ఉంది. చెపాక్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దీపక్ చాహర్ గాయపడ్డాడు. కేవలం రెండు బంతులు మాత్రమే వేసి మైదానాన్ని వీడాడు. పైగా అతను తదుపరి మ్యాచ్ కోసం జట్టుతో కలిసి ప్రయాణించ లేదు. దీంతో అతను మిగిలిన మ్యాచ్‌ల్లో ఆడటంపై అనుమానాలు కలుగుతున్నాయి.

చెన్నై సూపర్ కింగ్స్ తదుపరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. మే 05న హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం దీపక్ చాహర్ జట్టుతో కలిసి హిమాచల్ ప్రదేశ్‌ వెళ్లలేదు. చెన్నైలోనే ఉండిపోయాడు. మరోవైపు, అతని గాయం యొక్క తీవ్రతను అంచనా వేయడానికి సీఎస్కే మేనేజ్‌మెంట్ వైద్య బృందం నుండి నివేదిక కోసం వేచి చూస్తోంది.

"దీపక్(దీపక్ చాహర్) గాయం ఫర్వాలేదనిపిస్తోంది. అతను సీజన్‌కు దూరమయ్యాడని చెప్పను కానీ, కాస్త అనుమానంగానే ఉంది.." అని CSK CEO కాశీ విశ్వనాథ్ అన్నట్లు క్రిక్‌బజ్ నివేదిక వెల్లడించింది.  

దేశ సేవల కోసం ఒకరు.. వీసా అంటూ మరొకరు

బంగ్లా పేసర్  ముస్తాఫిజుర్ రెహ్మాన్.. దేశసేవల కోసం స్వదేశానికి వెళ్ళిపోయాడు. మే 3 నుంచి జింబాబ్వే, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20ల సిరీస్ ప్రారంభమైంది. ఈ సిరీస్​ మే 12న ముగియనుండగా, మే 20 నుంచి బంగ్లాదేశ్..  అమెరికాతో మరో టీ20 సిరీస్ ఆడనుంది. దీంతో ముస్తాఫిజుర్ తిరిగి చెన్నై జట్టుతో కలవడం కష్టమే. మరోవైపు, టీ20 ప్రపంచ కప్ 2024 వీసా ప్రాసెస్ కోసం స్వదేశానికి తిరిగి వెళ్ళాడు. అతను జట్టులో చేరడానికి మరో రెండు రోజులు పెట్టొచ్చని సమాచారం. 

తుషార్ దేశ్‌పాండే అనారోగ్యం

ఇక ఆ జట్టు రెగ్యులర్ బౌలర్ తుషార్ దేశ్‌పాండే అనారోగ్యానికి గురయ్యాడు. అందువల్ల అతను పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు. ఎప్పటికీ తిరిగి కోలుకుంటాడనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి.

ఇప్పటివరకూ ఈ సీజన్‌లో 10 మ్యాచులు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్..​ ఐదింటిలో గెలిచింది. దీంతో 10 పాయింట్లతో టేబుల్​లో ఐదో స్థానంలో ఉంది. లీగ్ దశలో వీరింకా 4 మ్యాచ్‌లు ఆడాల్సివుండగా.. అన్నింటా విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ అర్హతపై ఆశలు పెట్టుకోవచ్చు.