IPL 2025: అలా జరిగితేనే ధోనీకి ఛాన్స్.. చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకునే ఆటగాళ్లు వీళ్లేనా..?

IPL 2025: అలా జరిగితేనే ధోనీకి ఛాన్స్.. చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకునే ఆటగాళ్లు వీళ్లేనా..?

ఐపీఎల్ 2025 లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆడతాడా లేదా అనే విషయంపై మరి కొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది.  బుధవారం (జూలై 31) బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీల మధ్య జరగనున్న సమావేశం ధోనీ ఐపీఎల్ భవితవ్యం ఆధారపడి ఉంది. బీసీసీఐ 5 లేదా 6 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి అనుమతి ఇస్తే మహేంద్రుడు 2025 ఐపీఎల్ ఆడతాడు. అలా కాకుండా ఎప్పటిలాగే నలుగురిని మాత్రమే తీసుకునే రూల్ కొనసాగితే ధోనీ 2025 ఐపీఎల్ ఆడకపోవచ్చు. 

బీసీసీఐ 5 లేదా 6 గురు ప్లేయర్లను రిటైన్ చేసుకోవడానికి ఆసక్తిగా లేనట్టు సమాచారం. ఒకవేళ ధోనీ ఆటగాడిగా చెన్నై జట్టు రిటైన్ చేసుకోకపోతే అతను తన జట్టుకు మెంటార్ గా కొనసాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 2008 నుంచి ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతోనే కొనసాగాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టును 5 సార్లు ఛాంపియన్ గా నిలిపాడు. ఇప్పటికే కెప్టెన్సీకి గుడ్ చెప్పిన మాహీ.. 2025 ఐపీఎల్ ఆడట్లేదని హింట్ ఇచ్చేశాడు. పైగా అతనికి మోకాలి గాయం వేధిస్తుంది. గాయంతోనే 2024 ఐపీఎల్ ఆడిన ధోనీ వచ్చే ఏడాది ఆడటం అనుమానంగానే మారింది. 

నలుగురిని రిటైన్ చేసుకోవాల్సి వస్తే చెన్నై ఫ్రాంఛైజీలు రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, మతీషా పతిరన, శివమ్ దూబేలని తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. గైక్వాడ్ కెప్టెన్ గా కొనసాగుతారు. ఆల్ రౌండర్ గా జడేజా, దూబే.. యువ సంచలనం పతిరానా జట్టుతోనే ఉండడం దాదాపుగా ఖాయమైంది. 2023 ఐపీఎల్ లో ధోనీ కెప్టెన్సీలో ట్రోఫీ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. 2024 ఐపీఎల్ లో గైక్వాడ్ కెప్టెన్సీలో ప్లే ఆఫ్ కు చేరకుండానే ఇంటిదారి పట్టింది.