CSK vs PBKS: రుతురాజ్ ఒంటరి పోరాటం.. పంజాబ్ ఎదుట ఊరించే లక్ష్యం

CSK vs PBKS: రుతురాజ్ ఒంటరి పోరాటం.. పంజాబ్ ఎదుట ఊరించే లక్ష్యం

6 ఓవర్లకు 55/0.. 10 ఓవర్లకు 71/3.. 15 ఓవర్లకు 102/3.. 20 ఓవర్లకు 162/7.. చెపాక్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై బ్యాటర్ల ప్రదర్శన ఇది. ఇలా మ్యాచ్ అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది. మంచి ఆరంభాన్ని అందుకున్న చెన్నై.. మిడిల్ ఓవర్లలో తడబడింది. మరోసారి ఆఖరిలో బ్యాట్ ఝుళిపించే అవకాశం వచ్చినా.. అక్కడా తడబడింది. చివరకు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఓపెన‌ర్లు రుతురాజ్ గైక్వాడ్(62), అజింక్యా ర‌హానే(29) దంచికొట్టారు. ఎడా పెడా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో చెన్నై పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసింది. అనంతరం కింగ్స్ స్పిన్నర్ హ‌ర్‌ప్రీత్ బ్రార్ వారికి అడ్డుకట్ట వేశారు. ఒకే ఓవర్‌లో రహానే, శివమ్ దూబే(0)ని ఔట్ చేసి చెన్నై శిబిరంలో అలజడి రేపాడు. ఆ మరుసటి ఓవర్‌లో రాహుల్ చాహర్.. రవీంద్ర జడేజా (2) వెనక్కి పంపాడు.

రుతురాజ్ ఒంటరి పోరాటం

మరో ఎండ్‌లో వికెట్లు పడుతున్నా.. రుతురాజ్ గైక్వాడ్ మాత్రం తన పోరాటాన్ని ఆపలేదు. బౌండరీలు సాధించకపోయినా.. వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. జడేజా స్థానంలో క్రీజులోకి వచ్చిన సమీర్ రిజ్వీ ( 23 బంతుల్లో 21) మిడిల్ ఓవర్లలో వేగంగా ఆడలేకపోయాడు. ఆపై కీలక సమయంలో రుతురాజ్ ఔట్ అవ్వడం, మొయిన్ అలీ (15), ధోనీ (14; 11 బంతుల్లో ఒక సిక్స్) మెరుపులు మెరిపించకపోవడంతో సాధారణ లక్ష్యానికే పరిమితమైంది. కింగ్స్ బౌలర్లలో రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. రబడ, అర్షదీప్ సింగ్ చెరో వికెట్ తీసుకున్నారు.

మ్యాజిక్ టార్గెట్

162 పరుగులంటే తక్కువ లక్ష్యమేమీ కాదు.. అందునా చెన్నై సొంతగడ్డపై మ్యాచ్ అంటే.. పంజాబ్ బ్యాటర్లు శ్రమించాల్సిందే. జడేజా 4 ఓవర్లను ధీటుగా ఎదుర్కొంటే విజయం సాధించవచ్చు.