CSK vs PBKS: చెన్నై జోరుకు బ్రేక్.. సొంతగడ్డపైనే మట్టికరిపించిన పంజాబ్

CSK vs PBKS: చెన్నై జోరుకు బ్రేక్.. సొంతగడ్డపైనే మట్టికరిపించిన పంజాబ్

గెలిచి ప్లే ఆఫ్స్ ఆశలను పదిలం చేసుకోవాలనుకున్న చెన్నై ఆశలపై పంజాబ్ కింగ్స్ నీళ్లు చల్లింది. కీలక సమయంలో విజయం సాధించి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. బుధవారం(మే 01)  చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట సూపర్ కింగ్స్ 162 పరుగులు చేయగా.. పంజాబ్ బ్యాటర్లు 17.5 ఓవర్లలో ఆ లక్ష్యాన్ని చేధించారు. ఈ సీజన్‌లో సొంతగడ్డపై(చిదంబరం స్టేడియం, చెపాక్) చెన్నైకిది తొలి ఓటమి. 

బెయిర్‌స్టో, రోసో జోరు

163 పరుగుల ఛేదనలో పంజాబ్ తొలి ఓవర్‌లోనే 12 పరుగులు చేసింది. దీపక్ చాహర్‌ వేసిన తొలి ఓవర్‌లో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (13) ఫోర్, సిక్స్ బాదాడు. ఆపై తడబడుతూ వచ్చిన ప్రభ్‌సిమ్రన్.. రిచర్డ్ గ్లీసన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అక్కడినుంచి రిలీ రొసోవ్ (43; 23 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), బెయిర్‌స్టో(46; 30 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్) జోడి చెన్నై బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. వీరిద్దరిని ఎలా కట్టడి చేయాలో చెన్నై బౌలర్లకు అంతుపట్టలేదు. ఆ సమయంలో బాల్ చేతికందుకున్న శివమ్ దూబే.. బెయిర్‌స్టోను పెవిలియన్ చేర్చాడు.

ఆపై కొద్దిసేపటికే శార్దూల్ ఠాకూర్.. రోసోను బౌల్డ్ చేసి పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేశాడు. అనంతరం సామ్ కరన్ (26 నాటౌట్), శశాంక్ సింగ్ (25 నాటౌట్) జోడి మిగిలిన పని పూర్తి చేశారు. ఈ మ్యాచ్‌లో మతీష పతిరాణా, తుషార్ దేశపాండే లోటు చెన్నై జట్టులో స్పష్టంగా కనిపించింది. వారికి కీలక సమయంలో వికెట్లు తీసే బౌలరే కరువయ్యారు. 

రుతురాజ్ ఒంటరి పోరాటం.. 

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఒక్కడు 62 పరుగులు చేయగా.. ఇతర బ్యాటర్లంతా కలిపి 100 పరుగులు చేశారు. ఆ వందలో ఎక్సట్రాలు.. 18. ఆ జట్టు ఇన్‌ఫామ్ బ్యాటర్ శివమ్ దూబే(0) డకౌట్ కావడం వారిని బాగా దెబ్బతీసింది. కింగ్స్ బౌలర్లలో రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. రబడ, అర్షదీప్ సింగ్ చెరో వికెట్ తీసుకున్నారు.