భళా.. బెంగళూరు.. 50 రన్స్‌‌ తేడాతో చెన్నైపై గ్రాండ్ విక్టరీ

భళా.. బెంగళూరు.. 50 రన్స్‌‌ తేడాతో చెన్నైపై గ్రాండ్ విక్టరీ

చెన్నై: ఆల్‌‌రౌండ్‌‌ షోతో చెలరేగిన రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరు.. ఐపీఎల్‌‌లో రెండో విజయాన్ని సాధించింది. కెప్టెన్‌‌ రజత్‌‌ పటిదార్‌‌ (32 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌‌లతో 51), ఫిల్‌‌ సాల్ట్‌‌ (32), విరాట్‌‌ కోహ్లీ (31) రాణించడంతో.. శుక్రవారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో ఆర్‌‌సీబీ 50 రన్స్‌‌ తేడాతో చెన్నై సూపర్‌‌కింగ్స్‌‌కు చెక్‌‌ పెట్టింది. టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 196/7 స్కోరు చేసింది. తర్వాత చెన్నై 20 ఓవర్లలో 146/8 స్కోరుకే పరిమితమైంది. రచిన్‌‌ రవీంద్ర (41) టాప్‌‌ స్కోరర్‌‌. ధోనీ (30 నాటౌట్‌‌), జడేజా (25) ఫర్వాలేదనిపించారు. రజత్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 

‘టాప్‌‌’ లేపారు..

ముందుగా బ్యాటింగ్‌‌కు దిగిన ఆర్‌‌సీబీకి సాల్ట్‌‌ మంచి ఆరంభాన్నిచ్చాడు. తొలి నాలుగు ఓవర్లలోనే ఐదు ఫోర్లు, ఓ సిక్స్‌‌ దంచాడు. రెండో ఎండ్‌‌లో కోహ్లీ సింగిల్స్‌‌తోనే సరిపెట్టాడు. కానీ ఐదో ఓవర్‌‌లో నూర్‌‌ అహ్మద్‌‌ (3/36) బౌలింగ్‌‌లో సాల్ట్‌‌ను ధోనీ స్టంపౌట్‌‌ చేయడంతో తొలి వికెట్‌‌కు 45 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. వన్‌‌డౌన్‌‌లో దేవదుత్‌‌ పడిక్కల్‌‌ (27) కూడా బ్యాట్‌‌ ఝుళిపించాడు. 6, 4, 4, 6తో టచ్‌‌లోకి వచ్చినా వికెట్‌‌ కాపాడుకోలేదు. 8వ ఓవర్‌‌లో అశ్విన్‌‌ (1/22) వేసిన బాల్‌‌కు భారీ షాట్‌‌కు యత్నించి కవర్స్‌‌లో రుతురాజ్‌‌కు లో క్యాచ్‌‌ ఇచ్చాడు. రెండో వికెట్‌‌కు 31  రన్స్‌‌ జతయ్యాయి. కోహ్లీతో కలిసిన రజత్‌‌ నెమ్మదిగా ఆడాడు. ఫలితంగా పవర్‌‌ప్లేలో 56/1 స్కోరు చేసిన బెంగళూరు 93/2తో ఫస్ట్‌‌ టెన్‌‌ ఓవర్స్‌‌ను ముగించింది. 11వ ఓవర్‌‌లో కోహ్లీ 6, 4తో దూకుడు పెంచగా, రజత్‌‌ బౌండ్రీ రాబట్టాడు. అయితే 13వ ఓవర్‌‌లో నూర్‌‌ అహ్మద్‌‌ వేసిన టాస్‌‌ బాల్‌‌కు కోహ్లీ డీప్‌‌ మిడ్‌‌వికెట్‌‌లో రచిన్‌‌కు క్యాచ్‌‌ ఇచ్చాడు. మూడో వికెట్‌‌కు 41 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. 14వ ఓవర్‌‌లో రజత్‌‌ 6, 4, 4 కొట్టినా, లివింగ్‌‌స్టోన్‌‌ (10)  ఓ సిక్స్‌‌ కొట్టి 16వ ఓవర్‌‌లో వెనుదిరిగాడు. ఇదే ఓవర్‌‌ ఆఖరి బాల్‌‌ను జితేశ్‌‌ శర్మ (12) సిక్స్‌‌గా మలిచి, ఆ వెంటనే మరో ఫోర్‌‌ కొట్టి 18వ ఓవర్‌‌లో వికెట్‌‌ ఇచ్చాడు. మధ్యలో 6, 4 బాదిన రజత్‌‌ 30 బాల్స్‌‌లో ఫిఫ్టీ అందుకున్నాడు. టిమ్‌‌ డేవిడ్‌‌ (22 నాటౌట్‌‌) నిలబడినా, 19వ ఓవర్‌‌లో పతిరణ (2/36) డబుల్‌‌ స్ట్రోక్‌‌ ఇచ్చాడు. నాలుగు బాల్స్‌‌ తేడాలో రజత్‌‌, క్రునాల్‌‌ పాండ్యా (0)ను ఔట్‌‌ చేశాడు. ఆఖరి ఓవర్‌‌లో డేవిడ్‌‌ హ్యాట్రిక్‌‌ సిక్స్‌‌లు కొట్టడంతో ఆర్‌‌సీబీ మంచి టార్గెట్‌‌ను నిర్దేశించింది. 

బౌలింగ్‌‌ సూపర్‌‌..

టార్గెట్‌‌ ఛేజింగ్‌‌లో చెన్నై టాప్‌‌ ఆర్డర్‌‌ను ఆర్‌‌సీబీ పేసర్లు ముప్పుతిప్పలు పెట్టారు. ఓ ఎండ్‌‌లో ఓపెనర్‌‌ రచిన్‌‌ రవీంద్ర పాతుకుపోయినా.. రెండో ఎండ్‌‌లో వరుస విరామాల్లో వికెట్లు తీశారు. రెండో ఓవర్‌‌లో హాజిల్‌‌వుడ్‌‌ (3/21) నాలుగు బాల్స్‌‌ తేడాలో రాహుల్‌‌ త్రిపాఠి (5), రుతురాజ్‌‌ గైక్వాడ్‌‌ (0)ను ఔట్‌‌ చేశాడు. రచిన్‌‌తో జత కట్టిన దీపక్‌‌ హుడా (4) సింగిల్స్‌‌తో స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేసినా నాలుగో ఓవర్‌‌లో భువనేశ్వర్‌‌ (1/20)వెనక్కి పంపాడు. దీంతో పవర్‌‌ప్లేలో సీఎస్కే 30/3తో ఎదురీత మొదలుపెట్టింది. ఫీల్డింగ్ పెరిగిన తర్వాత స్పిన్నర్లు మరింత కట్టుదిట్టంగా బౌలింగ్‌‌ చేయడంతో రన్‌‌రేట్‌‌ ఘోరంగా పడింది. 9వ ఓవర్‌‌లో సామ్‌‌ కరన్‌‌ (8)ను లివింగ్‌‌స్టోన్‌‌ (2/28) ఔట్‌‌ చేశాడు. 10వ ఓవర్‌‌లో శివమ్‌‌ దూబే (19) సిక్స్‌‌, ఫోర్‌‌ కొట్టడంతో స్కోరు 65/4కు మారింది. ఇక ఫర్వాలేదనుకున్న దశలో బౌలింగ్‌‌కు దిగిన యష్‌‌ దయాల్‌‌ (2/18).. 13వ ఓవర్‌‌లో డబుల్‌‌ ఝలక్‌‌ ఇచ్చాడు. ఐదు బాల్స్‌‌ తేడాలో రచిన్‌‌, శివమ్‌‌ దూబేను ఔట్‌‌ చేయడంతో చెన్నై 81/6తో కష్టాల్లో పడింది. చివర్లో జడేజా (25), ధోనీ బ్యాట్‌‌ ఝుళిపించినా చెన్నై టార్గెట్‌‌ను అందుకోలేకపోయింది. 

సంక్షిప్త స్కోర్లు

బెంగళూరు: 20 ఓవర్లలో 196/7 (రజత్‌‌ 51, సాల్ట్‌‌ 32, కోహ్లీ 31, నూర్‌‌ అహ్మద్‌‌ 3/36). 
చెన్నై: 20 ఓవర్లలో 146/8 (రచిన్‌‌ 41, ధోనీ 30*, హాజిల్‌‌వుడ్‌‌ 3/21).