CSK vs RR: రాయల్స్‌పై చెన్నై ఘన విజయం.. సినిమా క్లైమాక్స్‌లా ప్లే ఆఫ్స్ రేసు

CSK vs RR: రాయల్స్‌పై చెన్నై ఘన విజయం.. సినిమా క్లైమాక్స్‌లా ప్లే ఆఫ్స్ రేసు

ఐపీఎల్ 17వ సీజన్.. గత ఎడిషన్లకు భిన్నంగా సాగుతోంది. గతంలో 60 మ్యాచ్‌లు పూర్తయ్యాయి అంటే.. ప్లే ఆఫ్స్ చేరే నాలుగు జట్లేవి అన్న దానిపై పూర్తి స్పష్టత వచ్చేది. కానీ, ఈ ఏడాది మాత్రం లెక్కలు ఊహకందట్లేదు. ఊహించని ఫలితాలతో లెక్కలు ఎప్పటికప్పుడు తారుమారవుతున్నాయి. దీంతో ప్లే ఆఫ్స్ రేసు సినిమా క్లైమాక్స్‌ని తలపిస్తోంది.

ఇప్పటివరకూ దాదాపు 60 మ్యాచ్‌లు పూర్తవ్వగా.. అధికారికంగా ఒకే ఒక జట్టు(కోల్‌కతా నైట్ రైడర్స్) ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. మిగిలిన మూడు స్థానాల కోసం ఏడు జట్లు పోటీలో ఉన్నాయి. ఆదివారం(మే 12) జరిగిన మ్యాచ్‌లో రాయల్స్‌ను మట్టికరిపించి చెన్నై మరో అడుగు ముందుకేసింది. తొలుత రాజస్థాన్‌ను 141 పరుగుల స్వల్ప స్కోరుకే కట్టడిచేసిన రుతురాజ్ సేన.. అనంతరం ఆ లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో చేధించింది. ఈ విజయం చెన్నై అభిమానులకు సొంతోషాన్ని పంచగా.. మిగిలిన ఆరేడు జట్ల ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశను మిగిల్చింది. 

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. రాయల్స్ బ్యాటర్లలో రియాన్ పరాగ్(47), యశస్వి జైస్వాల్‌‌(24), జోస్ బట్లర్(21), ధృవ్ జురెల్(28) పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో సిమర్‌జిత్‌ 3, దేశ్‌పాండే 2 వికెట్లు తీసుకున్నారు.

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని చెన్నై 5 వికెట్లు కోల్పోయి.. 18.2 ఓవర్లలో చేధించింది. సీఎస్కే బ్యాటర్లు తలా ఓచేయి వేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. రచిన్ రవీంద్ర(27), రుతురాజ్ గైక్వాడ్ (42 నాటౌట్), డారిల్ మిచెల్(22), శివం దూబే(18) పరుగులు చేశారు. టార్గెట్ చిన్నది కావడంతో రాయల్స్ బౌలర్లకు పోరాడే అవకాశం కూడా దక్కలేదు.

నాలుగో స్థానానికి సన్‌రైజర్స్

ఈ విజయంతో రుతురాజ్‌ సేన సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వెనక్కినెట్టి మూడో స్థానానికి దూసుకొచ్చింది. ఇప్పటివరకూ 13 మ్యాచ్‌లు ఆడిన చెన్నై ఏడింట(14 పాయింట్లు) విజయం సాధించింది. 18 పాయింట్లతో కోల్‌కతా నైట్ రైడర్స్ అగ్రస్థానంలో ఉండగా.. 16 పాయింట్లతో శాంసన్ సైన్యం(రాజస్థాన్ రాయల్స్) రెండో స్థానంలో ఉంది. ఇక కమిన్స్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.