CSK vs RR: రాయల్స్‌ను దెబ్బకొట్టిన సిమర్‌జిత్‌.. చెన్నై ఎదుట ఈజీ టార్గెట్

CSK vs RR: రాయల్స్‌ను దెబ్బకొట్టిన సిమర్‌జిత్‌.. చెన్నై ఎదుట ఈజీ టార్గెట్

బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న రాజస్థాన్ రాయల్స్‌ను ఓ అన్ క్యాప్‌డ్ ప్లేయర్ వణికించాడు. అతనే ఢిల్లీ పేసర్.. సిమర్‌జిత్‌ సింగ్. మతీష పతిరాణ, ముస్తాఫిజర్ రెహ్మాన్ ల గైర్హాజరీతో చెన్నై జట్టులోకి వచ్చిన సిమర్‌జిత్‌ తన సత్తా ఏంటో చూపెట్టాడు. యశస్వి, బట్లర్, శాంసన్.. ఇలా ముగ్గురు టాపార్డర్ బ్యాటర్లను ఔట్ చేసి రాజస్థాన్‌ను చావుదెబ్బ దెబ్బకొట్టాడు. దీంతో రాయల్స్ 141 పరుగుల తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఆర్ఆర్ బ్యాటర్లలో పరాగ్(47 నౌటౌట్) ఒక్కడే పర్వాలేదనిపించాడు. 

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌ఆర్‌ ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌‌(24), జోస్ బట్లర్(21) ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ఆరంభించారు. సీఎస్‌కే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో వేగంగా పరుగులు రాబట్టలేకపోయారు. పవర్ ప్లేలో రాయల్స్ 42 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం బాల్ చేతికందుకున్న సిమర్‌జిత్‌.. వరుస ఓవర్లలో యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్‌ను పెవిలియన్ చేర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పరాగ్ (35 బంతుల్లో 47 నౌటౌట్).. శాంసన్(15)తో జత కలిసి స్కోరు బోర్డును నడిపించాడు.

వీరిద్దరూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దినప్పటికీ.. ధాటిగా ఆడలేకపోయారు. ఈ జోడి ప్రమాదకరంగా మారుతున్న సమయంలో సిమర్‌జిత్‌ మరోసారి బ్రేక్ త్రూ ఇచ్చాడు. శాంసన్‌ను ఔట్ చేసి రాయల్స్ భారీ స్కోర్ చేయకుండా దెబ్బకొట్టాడు. అనంతరం పరాగ్, ధృవ్ జురెల్(18 బంతుల్లో 28) ఇద్దరూ మంచి భాగస్వామ్యం నెలకొల్పినా.. భారీ స్కోర్లు చేయలేకపోయారు. తుషార్‌ దేశ్‌పాండే, శార్దూల్ ఠాకూర్, సిమర్‌జిత్‌ త్రయం చివరి ఐదు ఓవర్లను మంచిగా కట్టడి చేశారు.

చెన్నై బౌలర్లలో సిమర్‌జిత్‌ 3, దేశ్‌పాండే 2 వికెట్లు తీసుకున్నారు.