
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరుగుతున్న చావోరేవో మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. స్వల్పంగా మంచు కురిసి పిచ్ తేమగా ఉండటంతో బౌలింగ్కు అనుకూలిస్తుందని భావించిన SRH కెప్టెన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. SRH టీంలో రెండు మార్పులు చేసింది. షమీ, కమిందు మెండిస్ జట్టులోకి రావడం గమనార్హం. చెన్నై జట్టులో కూడా రెండు మార్పులు జరిగాయి. రచిన్ రవీంద్ర స్థానంలో బ్రెవిస్, విజయ్ శంకర్ స్థానంలో దీపక్ హుడాను తీసుకున్నట్లు చెన్నై కెప్టెన్ ధోనీ ప్రకటించాడు. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న రెండు జట్లు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి.
9వ స్థానంలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్(SRH), 10వ స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్ల మధ్య సమరం మొదలవబోతోంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఐపీఎల్ సీజన్-18లో 43వ మ్యాచ్ జరగనుంది. SRH, CSK జట్లు ఈ మ్యాచ్తో చావోరేవో తేల్చుకోబోతున్నాయి. ఈ రెండు జట్లు తలపడిన గత పది మ్యాచుల ఫలితం చూసుకుంటే చెన్నై జట్టుకే మెరుగైన ట్రాక్ రికార్డ్ ఉంది.
ఈ రెండు జట్లు పోటీ పడిన గత పది మ్యాచుల్లో చెన్నై జట్టు 7 మ్యాచుల్లో విజయం సాధించగా, హైదరాబాద్ జట్టు 3 మ్యాచుల్లో మాత్రమే చెన్నైపై నెగ్గింది. ఇక.. CSK vs SRH ఓవరాల్ ఐపీఎల్ ట్రాక్ రికార్డ్ పరిశీలిస్తే.. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకూ 21 మ్యాచులు జరగ్గా.. 15 మ్యాచుల్లో చెన్నై జట్టు విజయం సాధించింది. 6 మ్యాచుల్లో మాత్రమే SRH చెన్నై జట్టును ఓడించింది. ఇక.. ఈ సీజన్ విషయానికొస్తే.. ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో రెండే విజయాలు సాధించిన ఇరు జట్లూ ఆరేసి ఓటములు ఎదుర్కొన్నాయి.
సన్ రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), హర్షల్ పటేల్, జయ్దేవ్ ఉనద్కట్, జీషన్ అన్సారీ, మహ్మద్ షమీ
చెన్నై సూపర్ కింగ్స్: బ్రెవిస్, ఆయుష్ మాత్రే, షేక్ రషీద్, దీపక్ హుడా, శామ్ కరన్, శివమ్ దూబే, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పాతిరానా