- రోహిత్ సెంచరీ వృథా
ముంబై: ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్ల మధ్య పోరులో ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్‌దే పైచేయి అయింది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (63 బాల్స్‌లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 105 నాటౌట్) సెంచరీ కొట్టినా ముంబైకి ఓటమికి తప్పలేదు. రుతురాజ్ గైక్వాడ్ (40 బాల్స్‌లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 69), శివం దూబే (38 బాల్స్‌లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 66 నాటౌట్ ) ఫిఫ్టీలకు తోడు మతీష పతిరణ (4/28) ఖతర్నాక్ బౌలింగ్‌తో చెలరేగడంతో వాంఖడేలో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే 20 రన్స్ తేడాతో ముంబైని ఓడించింది. తొలుత సీఎస్కే 20 ఓవర్లలో 206/4 స్కోరు చేసింది. గైక్వాడ్, దూబేకు తోడు ధోనీ (4 బాల్స్‌లో 3 సిక్సర్లతో 20 నాటౌట్) సూపర్ ఫినిషింగ్ ఇచ్చాడు. ఛేజింగ్‌లో ముంబై ఓవర్లన్నీ ఆడి 186/6 స్కోరే చేసి నాలుగో ఓటమి ఖాతాలో వేసుకుంది. పతిరణకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
గైక్వాడ్, దూబే ధనాధన్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన చెన్నైకి స్టార్టింగ్‌లోనే షాక్ తగిలింది. ఓపెనర్ రహానె (5) కొయెట్జీ వేసిన రెండో ఓవర్లో పాండ్యాకు సింపుల్ క్యాచ్ ఇచ్చాడు. రచిన్ రవీంద్ర (21) నెమ్మదిగా ఆడినా కెప్టెన్ రుతురాజ్ దూకుడు చూపెట్టడంతో పవర్ ప్లేను చెన్నై 48/1తో ముగించింది. స్పిన్నర్ శ్రేయస్ బౌలింగ్‌లో రవీంద్ర ఔటవ్వగా దూబే రాకతో సీఎస్కే ఇన్నింగ్స్‌కు జోష్ వచ్చింది. హార్దిక్ వేసిన పదో ఓవర్లో మూడు ఫోర్లతో దూబే జోరు చూపెట్టాడు. మధ్వాల్ బౌలింగ్‌లో సిక్స్‌తో స్కోరు వంద దాటించిన గైక్వాడ్ కొయెట్జీ ఓవర్లోనూ సిక్స్‌తో 33 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు.
రొమారియో వేసిన 14వ ఓవర్లో దూబే 6, 6, 4 దంచగా.. గైక్వాడ్ ఫోర్ కొట్టడంతో 22 రన్స్ వచ్చాయి. మధ్వాల్ బౌలింగ్‌లో 6, 4 కొట్టి ఫుల్ జోష్‌లో ఉన్న గైక్వాడ్‌ను ఆఫ్ కట్టర్‌తో పెవిలియన్ చేర్చిన హార్దిక్16వ ఓవర్లో రెండే రన్స్ ఇచ్చాడు. బుమ్రా కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. హార్దిక్ వేసిన చివరి ఓవర్ రెండో బాల్‌కు డారిల్ మిచెల్ (17) ఔట్ అయ్యాడు. ఈ దశలో ఫ్యాన్స్ కేరింతల నడుమ క్రీజులోకి వచ్చిన ధోనీ హ్యాట్రిక్ సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. లాంగాఫ్, లాంగాన్, స్క్వేర్ లెగ్ మీదుగా బాల్స్‌ను స్టాండ్స్‌కు పంపిన ధోనీ స్కోరు 200 దాటించాడు. పాండ్యా రెండు, కొయెట్జీ, గోపాల్ చెరో వికెట్ తీశారు.
రోహిత్ జోరు.. పతిరణ దెబ్బ
భారీ టార్గెట్ ఛేజింగ్‌లో రోహిత్ ఒంటరి పోరాటం చేయగా.. కీలక సమయాల్లో వికెట్లు తీసిన పతిరణ చెన్నైని గెలిపించాడు. తొలుత రోహిత్, ఇషాన్ (23) ముంబైకి అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. తుషార్ వేసిన మూడో ఓవర్లో రోహిత్ సిక్స్ కొట్టగా.. శార్దూల్ బౌలింగ్‌లో ఇషాన్ వరుసగా 6, 4తో స్పీడు అందుకున్నాడు.వీళ్ల జోరుతో పవర్‌ప్లేలో ముంబై 63/0తో నిలిచింది. అయితే ఎనిమిదో ఓవర్లో మూడు బాల్స్ తేడాలో ఇషాన్‌తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ సూర్య కుమార్ (0)ను ఔట్ చేసిన పతిరణ ముంబైకి డబుల్ షాకిచ్చాడు.
సూర్య క్యాచ్‌ను ముస్తాఫిజుర్ బౌండ్రీ లైన్ వద్ద బ్యాలెన్స్ చేస్తూ అద్భుతంగా అందుకున్నాడు. యంగ్‌స్టర్ తిలక్ వర్మ (31) తోడుగా రోహిత్ అదే జోరు కొనసాగించి ఫిఫ్టీ పూర్తి చేసుకోవడంతో పాటు ముంబై స్కోరు వంద దాటించాడు. కానీ, 14వ ఓవర్లో మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన పతిరణ.. తిలక్‌ను ఔట్ చేసి మూడో వికెట్‌కు 60 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ చేశాడు. కెప్టెన్ హార్దిక్ (6) ఫెయిలయ్యాడు. మూడు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 11 రన్సే రావడంతో ముంబైపై ఒత్తిడి పెరిగింది. ముస్తాఫిజుర్ ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన టిమ్ డేవిడ్ (13) మరో షాట్‌కు ట్రై చేసి ఔటవగా.. తర్వాతి ఓవర్లో పతిరణ ఫుల్‌లెంగ్త్ బాల్‌తో రొమారియో షెఫర్డ్ (1) బౌల్డ్ చేసి ఆరే రన్స్ ఇచ్చి చెన్నై విజయాన్ని ఖాయం చేశాడు. 19వ ఓవర్లో సిక్స్, పతిరణ వేసిన ఆఖరి ఓవర్లో ఫోర్‌తో సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ పోరాటం ఓటమి అంతరాన్నే తగ్గించింది.
సంక్షిప్త స్కోర్లు
చెన్నై: 20 ఓవర్లలో 206/4 (గైక్వాడ్ 69, దూబే 66*, హార్దిక్ 2/43)
ముంబై: 20 ఓవర్లలో (రోహిత్ 104*, పతిరణ 4/28)